జనం కొడతారనే! ఆ పదాన్ని పాతరేశారు: బాబును ఏకేసిన జగన్, వైయస్ కంటే మరో అడుగు
చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాలనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ప్రజలు కొడతారనే భయంతోనే టీడీపీ మేనిఫెస్టోను సంబంధిత వెబ్ సైట్ నుంచి తీసేశారని జగన్ ఎద్దేవా చేశారు.
Recommended Video

సోమవారం చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో జగన్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ప్రతి కులాన్ని అన్ని రకాలుగా చంద్రబాబు మోసం చేశారని, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు.

ఆ పదాన్ని పాతరేశారు
‘విశ్వసనీయత' అనే పదాన్ని చంద్రబాబు మర్చిపోయారని, ఆ పదాన్ని చంద్రబాబు పాతరేశారని, నాయకుడు తాను ఇచ్చిన మాట తప్పితే రాజీనామా చేసి ఇంటికి పోయే రోజు రావాలని అన్నారు. ముష్టి వేసినట్టుగా విద్యార్థులకు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నారని, అది కూడా ఇంజనీరింగ్ విద్యార్థులకు సరిగా అందడం లేదని ఆరోపించారు.

ఎవరైనా సంతోషంగా ఉన్నారా?
‘నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూసిన తర్వాత సంతోషంగా ఎవరైనా ఉన్నారా? రైతులు, చేనేతలు, అక్కా చెల్లెమ్మలు, విద్యార్థులు, అవ్వాతాతలు ఎవరూ సంతోషంగా లేరు. చేనేతలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. ప్రతి కులాన్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా ఆయన మోసం చేశారు' అని జగన్ మండిపడ్డారు.

మాట తప్పారు
‘చేనేత కార్మికులకు ఒక్కటైనా మంచి జరిగిందా?వారికి రుణమాఫీ అయిందా? అని అడుగుతున్నా. చేనేత కార్మికులకు బడ్జెట్‌లో రూ.1000 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాకో చేనేత పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారు. రుణమాఫీ విషయంలో అదే జరిగింది. రుణాలు కట్టలేదని బ్యాంకులు వడ్డీ మీద వడ్డీలను వేస్తున్నాయి. చంద్రబాబు వల్ల మంచి జరిగేది కూడా జరక్కుండా పోయింది' అని ఆరోపించారు.

నేను రెండడుగులు వేస్తా..
వైయస్ ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కొడుకుగా నేను మరో రెండడుగులు ముందుకేస్తా. ప్రతి పేద కుటుంబానికి తోడుగా ఉండి, ప్రతి విద్యార్థిని ఉచితంగా పెద్ద చదువులు చదివించే బాధ్యత నాది. మీ పిల్లలను బడికి పంపితే.. ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఎంత ఖర్చైనా మేం భరిస్తాం. డాక్టర్లు, ఇంజినీర్లను చేస్తాం. ఫీజులు లక్షల్లో ఉన్నా కడతాం. చదివించడమే కాదు.హాస్టల్ ఖర్చులకు రూ.20వేలు కూడా ఇస్తాం. తాను ఇచ్చిన హామీల్లో ఎవరైనా మార్పులు కావాలంటే ప్రజలు సలహాలు ఇవ్వాలి' అని జగన్మోహన్ రెడ్డి ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications