బాబు నైజమే అది: మరోసారి ఫైరైన జగన్, ఎక్కడికీ పోలేదన్న శిల్పా
ప్రభుత్వం విమర్శల వర్షం కురిపిస్తు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్నారు.
కర్నూలు: ప్రభుత్వం విమర్శల వర్షం కురిపిస్తు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. ధర్మానికి తోడుగా ఉండేందుకు తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని జగన్ ధ్వజమెత్తారు.

బాబు మాట తప్పారు..
నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జన్మోహన్ రెడ్డి.. వీపీ నగర్, చింత అరుగు, మాల్‌దార్‌పేటలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు.
Recommended Video


నిలదీసిన జగన్..
జాబు కావాలంటే బాబు రావాలని చెప్పిన చంద్రబాబు నిరుద్యోగులకు ఒక్క జాబైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. గడిచిన మూలేళ్లలో ఒక్క ఇల్లైన పేదలకు కట్టించాడా? అని నిలదీశారు. ఉపఎన్నికలు వచ్చే వరకు కూడా చంద్రబాబు, ఆయన కొడుకు, మంత్రులను నంద్యాలలో ఎప్పుడైనా చూశారా? అని జగన్ ప్రశ్నించారు.

మోసం చేయడమే నైజం..
మోసం చేయడం చంద్రబాబు నైజమని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని జగన్ అన్నారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పడం తనకు చేతకాదని తెలిపారు. మనం వేసే ఓటు ఎవరినో ఎమ్మెల్యే చేసేందుకు మాత్రమే కాదని, చంద్రబాబు మూడున్నరేళ్ల పరిపాలనపై ఓటు వేయబోతున్నామని తెలిపారు.

హామీలిచ్చారు కానీ..
వైయస్సార్ పాలనలో నంద్యాలలో 21,800 పెన్షన్లు ఉంటే.. బాబు పాలనలో 15వేలకు కుదించారని చెప్పారు. ఈ 38నెలల్లో ప్రతి ఇంటికీ చంద్రబాబు రూ.78వేలు బకాయి పడ్డారని చెప్పారు. కర్నూలుకు విమానాశ్రయం, ట్రిపుల్ ఐటీ పెట్టిస్తామన్నారని, అవుకు వద్ద ఇండస్ట్రియల్ పార్క్, అదోని, ఎమ్మిగనూరులో అపెరల్ పార్కులు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని జగన్ గుర్తు చేశారు. సీఎం హోదాలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని జగన్ మండిపడ్డారు. ‘జగన్ అబద్ధం చెప్పడు, మోసం చేయడు.. వాళ్ల నాన్న మాదిరే మాటపై నిలబడతాడన్న నమ్మకం, విశ్వసనీయతే నా ఆస్తి' అని జగన్ చెప్పారు.

ఎక్కడికి పోలేదంటూ చక్రపాణిరెడ్డి
ఆగస్టు 2న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి బుధవారం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్పీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఎక్కడా కనిపించకపోవడంతో రకరకాల వార్తలు వచ్చాయి. దీంతో బుధవారం జగన్ ప్రచారంలో పాల్గొని తాను ఎక్కడికీ వెళ్లిపోలేదని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications