బెజవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ-విపక్షాలపై నిప్పులు చెరిగిన జగన్..!
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకున్న భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఇవాళ విజయవాడ స్వరాజ్ మైదాన్ లో ఆవిష్కరించారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ విగ్రహాన్ని రెండేళ్లలో నిర్మించారు. దీన్ని ఇవాళ ప్రారంభించిన సీఎం జగన్.. అనంతరం ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన సభలో విపక్షాలపై నిప్పులు చెరిగారు. గతంలో వెనుకబడిన వర్గాల్ని చంద్రబాబు ఎలా అవమానించారో జగన్ మరోసారి గుర్తుచేశారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఆమెరికా గుర్తువచ్చినట్లు ఇక పై స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తొస్తుందన్నారు.

అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేళ సామాజిక చైతన్యవాడలా విజయవాడ కనిపిస్తోందని సీఎం జగన్ తెలిపారు. ఈ సందర్భంగా దళిత, బహుజన జాతులకు జగన్ అభినందలు తెలిపారు. సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఏర్పాటు చేసుకున్నామని, అంబేద్కర్ స్ఫూర్తితో అందరినీ ఒక్క తాటిపై నిలబెట్టామని జగన్ వెల్లడించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ మహా ప్రతిమ అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు.

రాష్ట్రంలో ఎల్లో మీడియా తీరుపై మరోసారి జగన్ తీవ్ర విమర్శలు చేశారు. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు పట్టించుకోకపోవడం, పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం, పేద పిల్లలకు ట్యాబ్ లు ఇస్తుంటే కుట్రపూరితంగా వార్తలు రాయడం, పథకాల అమల్లో వివక్ష చూపడం వంటివి రూపం మార్చుకున్న అంటరానితనమే అని జగన్ తెలిపారు. పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా అని జగన్ ప్రశ్నించారు.

అంబేద్కర్ విగ్రహం పెత్తందారులకు నచ్చదని, చంద్రబాబు పెత్తందారని, కాబట్టి ఆయనకు దళితులంటే చులకన అని జగన్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని, కానీ చంద్రబాబు దళితులకు సెంటు భూమి ఇచ్చింది లేదన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గతంలో దళితులు, బీసీలపై చేసిన వ్యాఖ్యల్ని జగన్ గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications