ఒక్కరే: విజయమ్మని, షర్మిలని పక్కన పెట్టనున్న జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల బరిలో సోదరి షర్మిలను, తల్లి వైయస్ విజయమ్మను పక్కన పెట్టనున్నారా? అంటే అవుననే అంటున్నారు. 2014 ఎన్నికలలో తమ పార్టీలో సాధ్యమైనంత వరకు ఒక్కో కుటుంబం నుండి ఒక్కరినే పోటీ చేయించాలనే ఆలోచనతో జగన్ ఉన్నారట. ఇందులో భాగంగా అతను తన కుటుంబం నుండే దానిని పాటించాలని భావిస్తున్నారట. దీంతో తన కుటుంబం నుండి జగన్ ఒక్కరే పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు.
రానున్న ఎన్నికల్లో విజయమ్మ, షర్మిలలు పోటీ చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు. కానీ, జగన్ ఆలోచన వారిని పోటీలో నిలబడకుండా చేయనుందంటున్నారు. జగన్ జైలులో ఉన్నప్పుడు విజయమ్మ, షర్మిలలు పార్టీని నడిపించారు. షర్మిల మూడువేల కిలోమీటర్లకు పైగా నడిచి చరిత్ర సృష్టించారు. ఆమె కడప నుండి లోకసభకు పోటీ చేయాలని భావించారు.

జగన్ ఆ టిక్కెట్ పైన సోదరుడికి ఇవ్వడంతో విశాఖపట్నం నుండి పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. మరోవైపు విజయమ్మ పార్టీ పులివెందుల నుండి రెండోసారి ప్రాతనిథ్యం వహిస్తున్నారు. ఆమె పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. మన కుటుంబం నుండి ఒక్కరమే ఎన్నికల్లో పోటీ చేస్తామని, మిగతా వారు ప్రచారం చేయాలని జగన్ తల్లికి, సోదరికి సూచించారట. దీంతో పార్టీ సిఎం అభ్యర్థి అయిన జగన్ మాత్రమే పోటీ చేయనున్నారంటున్నారు.
జగన్ నిర్ణయం పైన విజయమ్మ గానీ, షర్మిల గానీ ఎలాంటి అసంతృప్తితో లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయట. తమకు రాజకీయాల పైన ఎలాంటి ఆసక్తి లేదని, తప్పని పరిస్థితుల్లో మాత్రమే తాము రావాల్సి వచ్చిందని, వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని విజయమ్మ అంటున్నారట.
కాగా, జగన్ బెయిల్ పైన విడుదలయ్యాక షర్మిలను దూరం పెట్టినట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, షర్మిలకు ఎలాంటి అసంతృప్తి లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. జగన్ విడుదలయ్యాక షర్మిల తన కుటుంబాన్ని చూసుకునేందుకు బెంగళూరు వెళ్లిపోయారు. ప్రస్తుతానికి విజయమ్మకు, షర్మిలకు రాజకీయాలపై ఆసక్తి లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications