అదేంటో.. చంద్రబాబు వస్తే జనం గ్యారెంటీగా మోసపోతారు
YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..పై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
ఎన్నికలకు ముందు అధికారం కోసం చంద్రబాబు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇచ్చారు. నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేశారని, ఇది ఇవాళ మరోసారి నిజమైందని ధ్వజమెత్తారు. సూపర్-6, సూపర్-7 పేరిట ప్రజలకు చంద్రబాబు వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు.

తమ ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతంగా అమలైన రైతుభరోసా పథకాన్ని దారుణంగా దెబ్బ తీశారlని, మీ హామీ ఒక మోసం, మీ ష్యూరిటీ ఇంకో మోసం, మీ బాండ్లు మరో మోసం, మీరిచ్చిన గ్యారెంటీ పచ్చి మోసమే.. అని జగన్ విమర్శించారు. ఇవాళ దర్శి సభలో మీ నోటితో మీరు చెప్పినట్టుగా, మీరు ఉన్నంతవరకూ రైతులకు భరోసా లేదన్నది ముమ్మాటికీ వాస్తవమే.. అని చెప్పారు.
కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా, ఏటా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న హామీని చంద్రబాబు మంటగలిపారని జగన్ ఆరోపించారు. ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ. 5 వేలు మాత్రమేనని చెప్పారు.
అది కూడా ఎంతమందికి చేరిందో తెలియదని, ఖరీఫ్ సీజన్ మొదలై 2 నెలలు అయిపోయినా, పెట్టుబడి సాయం చేయకుండా మళ్లీ రైతులను వడ్డీ వ్యాపారులవైపు, ప్రైవేటు అప్పులవైపు మళ్లించారని జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే, చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా సవాలక్ష నిబంధనలు పెట్టి, సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టారని అన్నారు.
ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? వాగ్దానాల అమల్లో మీకు చిత్తశుద్ధిలేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వారిని మభ్యపెట్టడానికి దర్శిలో ఈ మోసపూరిత కార్యక్రమాన్ని, సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.. అని జగన్ పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో, అంతకుముందు మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మళ్లీ నిలబెడితే, ఇప్పుడు మళ్లీ సర్వనాశనం చేస్తున్నారుని, రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉందని, తాము ధరల స్థిరీకరణ నిధినిపెట్టి, తద్వారా రూ.7,800కోట్లు ఖర్చుచేసి రైతులను ఆదుకున్నామని జగన్ గుర్తు చేశారు.
చంద్రబాబు దాన్ని రద్దుచేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారని జగన్ విమర్శించారు. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తివేశారని, తాము ప్రవేశపెట్టి, అమలుచేసి, అనేక వైపరీత్యాల సమయంలో రూ.7,802.5 కోట్లు అందించి, రైతులను విశేషంగా ఆదుకున్న ఉచిత పంటల బీమాను రద్దుచేశారుని అన్నారు.
ఇన్సూరెన్స్ కోసం రైతులు ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, గత ఏడాది కూడా చంద్రబాబు బీమా సొమ్ములు కట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని జగన్ పేర్కొన్నారు. ఆర్బీకేలు, ఇ-క్రాప్, టెస్టింగ్ ల్యాబులను నిర్వీర్యం చేశారని వివరించారు.
ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను, పురుగు మందులను సర్టిఫై చేసి తాము అందిస్తే, తిరిగి మీరు మీ సిండికేట్ ముఠాలను ప్రోత్సహించి ఉద్దేశ పూర్వకంగా వాటి కొరతను సృష్టించి రైతులను దోచుకునే పరిస్థితికి తీసుకు వచ్చారని జగన్ గుర్తు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం, ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఏ రైతుకూ భరోసా లేకపోవడం, వ్యవసాయరంగంలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితులకు నిదర్శనంమని, కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదుకోకపోవడం, చంద్రబాబు అమానవీయతకు, నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనని జగన్ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications