సజ్జల స్థానంలో ఫైర్ బ్రాండ్ కు జగన్ బాధ్యతలు..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి నేతలు వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇటు జగన్ సైతం జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయం లో పార్టీలోనూ ప్రక్షాళన చేస్తున్నారు. జిల్లాల నియామకాలను పూర్తి చేయటంతో పాటుగా పార్టీలో కీలక నేతల బాధ్యతల్లోనూ మార్పులకు సిద్దం అయ్యారు. జగన్ కోటరీ పేరుతో సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య లు పార్టీలో చర్చగా మారాయి. భారీ ఓటమితో అవసరమైన మార్పుల దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సజ్జల స్థానంలో మరో కీలక నేతకు బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సిద్దమయ్యారు.
కీలక నిర్ణయాలు
వైసీపీలో ముఖ్య నేతల బాధ్యతల్లో మార్పులకు రంగం సిద్దమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకం గా వ్యవహరించిన సాయిరెడ్డి పార్టీ వీడే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ కోటరీ మాట విని నష్టపోతున్నారని చెప్పుకొచ్చారు. పరోక్షంగా సజ్జల, సుబ్బారెడ్డిని ఉద్దేశించి సాయిరెడ్డి వ్యాఖ్య లు చేసారు. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల్లో సాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి తొలి మూడు స్థానాల్లో నిలుస్తారు. అయితే, పార్టీ ఓటమి తరువాత పలువురు నేతలు నేరుగా సజ్జల పైన గురి పెట్టారు. జగన్ కు వాస్తవాలు చెప్పకుండా సజ్జల మభ్య పెట్టారని విమర్శించారు. జగన్ ను కలవనీయకుండా అన్నింటిలోనూ జోక్యం చేసుకొని సజ్జల నష్టం చేసారని పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేసారు.

సజ్జల కు కొత్తగా
జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన నమ్ముకున్న నేతలు, అధికారుల కారణంగా నష్టం జరిగిందని.. పార్టీతో గ్యాప్ కు అదే కారణమని పలువురు నేతలు వాపోయారు. సజ్జలతో పాటుగా ఆయన కుమారుడు పైన పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారం కోల్పోయిన తరువాత సజ్జల హవా తగ్గింది. అయినా, పార్టీ వ్యవహారాల్లో.. సమావేశాల్లో మాత్రం కీలకంగానే వ్యవహరిస్తున్నారు. ఈ సారి పార్టీ కేడర్ కే ప్రాధాన్యత ఉంటుందని పదే పదే చెబుతున్న జగన్.. సజ్జల బాధ్యతలను మార్పు చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. పార్టీ నేతల సమన్వయ బాధ్యతలను ఇక నుంచి సజ్జల స్థానంలో పులివెందుల సతీష్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
సతీశ్ రెడ్డికి బాధ్యతలు
టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన సతీశ్ రెడ్డి పులివెందులలో వైఎస్ కుటుంబం పైన ఎన్నికల్లో పోటీ చేసారు. 2024 ఎన్నికల సమయంలో పులివెందుల టికెట్ బీటెక్ రవికి టీడీపీ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో సతీశ్ రెడ్డి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్నారు. జగన్ పైన విమర్శల సమయంలో ఘాటుగా స్పందిస్తున్నారు. సజ్జల స్థానంలో సతీష్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అదే సమయంలో సజ్జల సైతం పార్టీలోనే ఇతరత్రా బాధ్యతలు చూస్తారని తెలుస్తోంది. వచ్చే వారం తాడేపల్లిలో సతీశ్ రెడ్డి, సజ్జలతో జగన్ సమావేశం కానున్నారు. ఈ సమయంలోనే పెండింగ్ లో ఉన్న జిల్లాలకు అధ్యక్షులతో పాటుగా పార్టీ ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పులు చేస్తూ జగన్ నిర్ణయం వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications