ఇండియా కూటమిలోకి జగన్ ? కాంగ్రెస్ వీటికి ఒప్పుకుంటే..! కీలకంగా షర్మిల..!
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి, ఎంపీగా కూడా గెలిచి, తన తండ్రి మరణం తర్వాత అదే కాంగ్రెస్ తో విభేదించి, వైఎస్సార్సీపీ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న వైఎస్ జగన్ (YS Jagan).. ఆ క్రమంలో 16 నెలల పాటు జైలుకెళ్లేందుకూ వెరవలేదు. అప్పట్లో ఆ తెగువే ఆయన్ను ఏపీ రాజకీయాల్లో హీరోగా నిలబెట్టింది. సోనియా అంతటి శక్తిమంతురాలిని ఢీకొట్టిన వీరుడిగా జనం ఆయన్ను చూడటం మొదలుపెట్టారు. అదే చివరికి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును ఆయన లాక్కునేలా చేయడంతో పాటు తొలిసారి సీఎంను కూడా చేసింది. అయితే అదే కాంగ్రెస్ తో జట్టుకట్టేందుకు జగన్ ఇప్పుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ తో జగన్ బంధం-వైరం
2009లో సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ కు అన్నీ తానై నడిపించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పనిలో పనిగా తన కుమారుడు వైఎస్ జగన్ ను పార్టీలోకి తీసుకురావడంతో పాటు, తమ కంచుకోట కడప నుంచి ఎంపీగా నిలబెట్టి గెలిపించుకున్నారు. అయితే మూడు నెలల్లోనే ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవడంతో వైఎస్ జగన్ సహజంగానే సీఎం పదవి ఆశించడం, కాంగ్రెస్ లో ఓ వర్గం ఆ ప్రతిపాదనకు బలంగా మద్దతు తెలపడం కూడా జరిగాయి. అయితే అధిష్టానం ఆగ్రహంతో వారిలో చాలా మంది వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ ఎత్తుల్ని త్వరగానే అర్దం చేసుకున్న జగన్.. తన స్ధానంలో సీఎం అయిన రోశయ్యకు సహాయనిరాకరణ సాగించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం జగన్ ఓదార్పుయాత్రను ఆపాలని ఆదేశాలు ఇవ్వడం, కుదరదంటూ ఆయన తల్లి విజయమ్మతో కలిసి పార్టీకి గుడ్ బై చెప్పేయడం, వైఎస్సార్సీపీ స్దాపించి తిరిగి ఎంపీ కావడం, తల్లిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగిపోయాయి. దీంతో కాంగ్రెస్ అక్రమాస్తుల కేసులు పెట్టించి జగన్ ను జైలుకు పంపింది. అయినా వెనక్కి తగ్గకుండా మరో 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలు తెచ్చి గెలిపించుకున్నారు. దీంతో అధిష్టానం రూటుమార్చి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా నియమించింది. అదే సమయంలో జరిగిన ఏపీ విభజన లెక్కల్ని పూర్తిగా మార్చేసింది.

పడిలేచిన కెరటం- విపక్షం-అధికారం-విపక్షం
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తొలిసారి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని, ఆ పార్టీకి మద్దతిచ్చే మీడియాను ఎదుర్కొని వైఎస్సార్సీపీని 67 సీట్లలో గెలిపించుకోగలిగిన జగన్.. విపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఐదేళ్లు తిరిగే లోపే కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీని బయటికి తీసుకొచ్చేయడంతో పాటు ప్రధాని మోడీపై చంద్రబాబు తిరుగుబాటు చేసేలా ఒత్తిడి చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. విభజన హామీల అమలు పేరుతో జగన్ సాధించిన ఆ పోరాటం ఆయన్ను 2019లో సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. ఐదేళ్లలో తన మార్కు పాలన చూపించిన జగన్.. కరోనా కాలంలో ఇబ్బందుల్ని అధిగమించారు. అయితే విపక్షాన్ని టార్గెట్ చేసే క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీని పరోక్షంగా ఏకం చేశారు. దీంతో ఈ మూడు పార్టీలు కలిసి 2024 ఎన్నికల్లో జగన్ ను అడ్డుకున్నాయి. 11 సీట్లే వచ్చినా నిరాశపడకుండా ఇప్పటికీ దీటైన ప్రతిపక్షంగా జగన్ వైఎస్సార్సీపీని నిలబెట్టారు.
కేంద్రంలో మారిన సీన్-కాంగ్రెస్ పొత్తు
గతంలో అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా మెలిగిన జగన్.. ఆ తర్వాత ఓడిపోయినా బీజేపీకి మద్దతుగా నిలిచారు. కానీ దేశంలో ప్రస్తుతం మారుతున్న పరిస్ధితుల్లో బీజేపీ ప్రతిష్ఠ మసకబారుతుండటం, ఎన్నికల అక్రమాలకు తానే స్వయంగా ఏపీలో బాధితుడు కావడం వంటి అంశాలు జగన్ ను మౌనంగా ఉండనీయడం లేదు. దీంతో ఎన్నికల అక్రమాలపై జాతీయ స్ధాయిలో గట్టిగా పోరాడుతున్న తన మాజీ పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమివైపు జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దక్షిణాదిలో ఏపీ మినహా అన్ని రాష్ట్రాల్లో పటిష్టంగా మారిన కాంగ్రెస్ పార్టీ.. ఏపీలోనూ జగన్ ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కర్నాటక సీఎం డీకే శివకుమార్ తో దౌత్యం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎక్కడా వైఎస్సార్సీపీ నోరు విప్పడం లేదు.

కాంగ్రెస్ కు జగన్ షరతులు ?
జగన్ ను ఎలాగైనా ఇండియా కూటమిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓవైపు ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్నాటక సీఎం డీకే శివకుమార్ తో ఓవైపు దౌత్యం నడుపుతూనే, మరోవైపు ఏపీలో ఉనికి లేకపోయినా జాతీయ స్ధాయిలో ఇండియా కూటమిలో ఉన్న సీపీఐ నేతల్ని జగన్ వద్దకు పంపింది. పైకి ఏపీలో ఎల్ నినో పరిస్ధితులపై ఉమ్మడిగా ఉద్యమాలు చేస్తామని ఇరుపార్టీలు చెప్పినా, అంతర్గతంగా మాత్రం భవిష్యత్తులో ఇండియా కూటమిలోకి జగన్ ను రప్పించేందుకు కమ్యూనిస్టులు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేయడం, ఎన్నికల అక్రమాలపై గట్టిగా మాట్లాడటం జగన్ వైఖరిలో మార్పును సూచిస్తున్నాయి. అయితే పీసీసీ ఛీఫ్ గా ఉంటూ తనతో విభేదిస్తున్న వైఎస్ షర్మిలను తప్పించడం, ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా తగిన గౌరవం ఇవ్వడం, రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే కీలక పదవులు ఇస్తే మాత్రం కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు జగన్ కు అభ్యంతరం ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై బహిరంగంగా అటు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తే.. తానూ బయటపడాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.














Click it and Unblock the Notifications
