బాణసంచా పేలుళ్ల ఘటన: ప్రభుత్వ తీరుపై మండిపడ్డ జగన్
విశాఖపట్నం: విశాఖపట్నం పర్యటనలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రభుత్వం చెబుతున్నదేంటి, చేస్తున్నదేంటని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. విశాఖపట్నంలోని పాయకరావు పేట చేరుకున్న జగన్, గోకులపాడు బాణసంచా పేలుళ్ల ఘటనలో మృతి చెందిన భూపతి సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని స్వయంగా కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారని, ఇప్పుడు రూ. 2 లక్షలు ఇవ్వడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

అసెంబ్లీలో కార్మికశాఖ మంత్రి చేసిన ప్రకటనను జిల్లా కలెక్టర్‌కి అందజేస్తామన్నారు. బాణ సంచా పేలుళ్ల తర్వాత క్షతగాత్రులు, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో లాంటి విషయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తగిన సహాయం అందజేసేలా చూస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.
ఇది ఇలా ఉంటే బుధవారం ఉదయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించారు. ఇటీవల నెహ్రూ సోదరుడు సత్తిబాబు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో మధురవాడ వెళ్లిన వైయస్ జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జగ్గంపేట మీదుగా ఇర్రిపాక వెళ్లారు. కుటుంబ సభ్యుల అందరితో మాట్లాడిన జగన్ వారికి ధైర్యం చెప్పారు.












Click it and Unblock the Notifications