YS Jagan: విజయవాడకు జగన్ రిటర్న్స్-ఊహాగానాలకు చెక్ ?
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పులివెందులకు, ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయిన మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరిగి స్వరాష్టానికి చేరుకున్నారు. ఇవాళ బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. ఇవాళ్టి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం కాబోతున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 1.30కి బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన జగన్.. 3 గంటల సమయంలో విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీంతో అప్పటికే భారీ సంఖ్యలో వేచి చూస్తున్న అభిమానులు ఘన స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో ఎయిర్ పోర్టును హోరెత్తించారు. అభిమానులకు జగన్ అభివాదం చేస్తూ కాసేపు అక్కడే ఆగారు. అనంతరం బయలుదేరి ఇంటికి వెళ్లిపోయారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో బెంగళూరు లేదా హైదరాబాద్ లోనే జగన్ ఉండిపోతారన్న ఊహాగానాలు వస్తున్న వేళ జగన్ ఇవాళ తిరిగి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఈ నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యేలతో ఆ మేరకు చర్చించి వారికి దిశానిర్దేశం చేయాల్సి ఉంది. అలాగే పార్లమెంటులో ఎంపీలు, పార్టీకి చెందిన నేతలతో సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications