సాయంత్రం గవర్నర్ వద్దకు జగన్! అసెంబ్లీలో అడ్డగింత ప్లాన్ వేళ?
ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ ఆధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ గవర్నర్ తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా చోటు చేసుకున్న హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో గవర్నర్ వద్దకు జగన్ వెళ్లనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్ కు వైసీపీ ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్లేందుకు జగన్ సిద్దమవుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను గవర్నర్ కు జగన్ వివరిస్తారని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే అసెంబ్లీ సమావేశాలపైనా జగన్ గవర్నర్ తో చర్చించనున్నారు.

తాజాగా వినుకొండలో పార్టీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా, ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను జగన్ గవర్నర్ కు అందజేస్తారు.
వీటి ఆధారంగా తక్షణ చర్యలకు ఆదేశించాలని కోరనున్నారు. అలాగే మంగళవారం వైసీపీ ఢిల్లీ నిరసనపైనా ఆయనకు వివరిస్తారు.మరోవైపు రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించిన జగన్.. ఇవాళ ఆయనతో భేటీ అవుతుండటం విశేషం.












Click it and Unblock the Notifications