వైసీపీ కాకినాడ మేయర్ అభ్యర్ధి ఖరారు- పార్టీలో చేరగానే జగన్ ప్రకటన..!
ఏపీలో పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్ధుల్ని బరిలోకి దింపేందుకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నారు. దీంతో విపక్ష వైఎస్సార్సీపీ కూడా ఇవాళ కొత్త అభ్యర్ధిని కాకినాడ మేయర్ ఎన్నికల కోసం ఎంపిక చేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఇవాళ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కాకినాడకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కాద వెంకటరమణ కుటుంబ సభ్యులతో ఇవాళ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారికి జగన్ కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం డాక్టర్ కాద వెంకటరమణ సతీమణి కాద సత్యశ్రీని (Kada Satyasri) వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కాకినాడ మేయర్ (Kakinada Mayor) పదవికి పోటీ చేయించాలని నిర్ణయించారు. దీంతో ఆమె అధికారికంగా వైసీపీ తరఫున త్వరలో కాకినాడ మేయర్ పదవికి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.

కీలకమైన కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కూటమికి గట్టి సవాల్ విసరాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. అందులోనూ విద్యావంతురాలైన మహిళా అభ్యర్ధిని రంగంలోకి దించడం ద్వారా ఈ ఎన్నికల్ని పోటాపోటీగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వంటి వారు ఆమెను ఎంపిక చేసి జగన్ కు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ కాద సత్యశ్రీని మేయర్ అభ్యర్ధిగా ప్రకటించారు.














Click it and Unblock the Notifications
