Nara Lokesh: ఎదురుదెబ్బలపై రిపోర్ట్ కోరిన లోకేష్..! ఈ 4 కేటగిరీల వారీగా..!
ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ సత్తా చాటుకుంది. అయితే ఇంత ప్రభంజనంలోనూ పలు చోట్ల కూటమి పార్టీలకు ఎదురుదెబ్బలు తప్పలేదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో కూటమి సీట్ల సర్దుబాట్ల లోపాల నుంచి వైసీపీ సంస్ధాగత బలం వరకూ పలు కారణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తెలుసుకుని, లోపాలు సరిదిద్దుకునేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) రంగంలోకి దిగారు.
స్థానిక సంస్ధల ఎన్నికల్లో ముందుగా జరిగిన మున్సిపల్ పోరులో కూటమి మంచి విజయాలే సాధించినా, పరిషత్ పోరుకు వచ్చే సరికి వైసీపీ నుంచి పలు చోట్ల గట్టి పోటీ ఎదురైంది. దీంతో 76 జడ్పీటీసీలతో పాటు 1700 ఎంపీటీసీ స్ధానాల్లో కూటమి ఓటమిపాలైంది. దీనిపైనే ఇప్పుడు నారా లోకేష్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆయా స్ధానాల్లో ఓటమి వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవాలని భావిస్తున్న లోకేష్.. పార్టీ నేతల నుంచి మొత్తం నాలుగు కేటగిరీల్లో నివేదికలు కోరారు.

వీటిలో క్యాడర్ మనోభావాలకు వ్యతిరేకంగా అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల ఓడిపోయిన స్థానాలు, ఎంఎల్ఏ ల పనితీరు సరిగా లేక ఓడిపోయిన స్థానాలు, కూటమిలో సమన్వయలోపం కారణంగా ఓడిపోయిన స్థానాలు, వైసీపీ సంస్థాగతంగా బలంగా వుండటం వల్ల ఓడిపోయిన స్థానాలుగా వీటిని విభజించారు. వీటిలో ప్రతీ కోణంలోనూ సమీక్షించి అసలు లోపం ఎక్కడ జరిగిందనే అంశంపై లోకేష్ దృష్టిసారించబోతున్నారు. ఈ మేరకు నివేదికలు వచ్చాక దిద్దుబాటు చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు పరిషత్ ఎన్నికల్లో కూటమి ఓడిపోయిన స్ధానాల వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు మెజార్టీ విశ్లేషణలు తేల్చిచెప్పాయి. వాటిలో ఒకటి కూటమిలో లోపాలు అంటే బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టడం, గెలిచే పార్టీకి కాకుండా కోటా పేరుతో బలం లేని పార్టీకి సీట్లు ఇవ్వడం ఇలాంటివి. మరొకటి వైసీపీ నుంచి ఇంత ప్రతిఘటన ఊహించకపోవడం, ఆ పార్టీ సంస్థాగత బలం.














Click it and Unblock the Notifications
