చంద్రబాబును పదే పదే అక్కడకు రప్పించాలన్నదే జగన్ వ్యూహం?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మరోసారి పర్యటించబోతున్నారు. జనవరి 4, 5, 6 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ వెల్లడించారు. 4వ తేదీన బెంగళూరు నుంచి శాంతిపురం మండలం చెంగుబల్లకు చేరుకుంటారు. చెంగుబల్లతోపాటు కెనమాకుపల్లె, 121-పెద్దూరు, రామకుప్పం, కుప్పం, గుడుపల్లెల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నిర్వహించబోతున్నారు.

నామినేషన్ కూడా స్థానిక నేతలే వేసేవారు
ఎన్నికల సమయంలో కుప్పం నియోజకవర్గం నుంచి పోటీచేసే చంద్రబాబు నామినేషన్ వేయడానికి కూడా వెళ్లేవారు కాదు. తెలుగుదేశం పార్టీ నేతల చేత నామినేషన్ వేయించేవారు. నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు గెలుపొందిన చంద్రబాబును పదే పదే కుప్పం రప్పించాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ఉంది. కుప్పంపై దృష్టిసారించడంవల్ల ఇతర నియోజకవర్గాలపై దృష్టి తగ్గుతుందని, అది తమకు అనుకూలంగా మారుతుందని వైసీపీ పెద్దలు అంచనా వేస్తున్నారు.

జైలులో ఉన్న నాయకులను కలిసిన చంద్రబాబు
స్థానికంగా బలంగా ఉన్న టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. ఇటీవలే చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో దాదాపు 70 మంది టీడీపీ నేతలను బెయిల్ లేకుండా పోలీసులు జైలుకు తరలించారు. తెలుగుదేశం పార్టీ న్యాయవిభాగంద్వారా వారందరికీ బెయిల్ తెప్పించారు. ఈ నేతలంతా చిత్తూరు సబ్ జైలులో ఉన్న సమయంలో చంద్రబాబు వారిని కలిశారు. తన జీవితంలో జైలుకు వెళ్లి నాయకులను కలవడం ఇదే మొదటిసారని వ్యాఖ్యానించారు.

ఇల్లు కట్టుకుంటున్న చంద్రబాబు
ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న భరత్ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ప్రత్యర్థి అవుతారు. బీసీ ఓటర్లను ఆకట్టుకోవడంద్వారా భరత్ బీసీ అనే మంత్రాన్ని పఠించి చంద్రబాబును ఓడించాలనేది జగన్ యోచనగా ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాన్ని పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబును కుప్పం నుంచి ఓడించాలన్నదే వైసీపీ ధ్యేయంగా ఉంది. అప్రమత్తంగా ఉన్న చంద్రబాబు వీలు కుదిరినప్పుడల్లా కుప్పం పర్యటిస్తూ కంచుకోటను చేజారకుండా చూసుకుంటున్నారు. స్థానికంగా ఇల్లు కట్టుకుంటున్న చంద్రబాబు తాను కుప్పంలోనే ఉంటానంటూ నాయకులకు భరోసా కల్పిస్తున్నారు. ఆయన తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో చేయబోతున్న పాదయాత్ర కూడా కుప్పం నుంచే ప్రారంభం కాబోతోంది. యాత్రను అడ్డుకుంటామంటూ వైసీపీ నాయకులు ప్రకటిస్తున్నారు. రానున్న రోజుల్లో కుప్పం రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయో వేచిచూడాలి.












Click it and Unblock the Notifications