చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇద్దరూ కలవడమే నాక్కావాలి: సీఎం జగన్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇద్దరూ కలిసి పొత్తు పెట్టుకోవడమే తనక్కావాలి అంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నంలో జరిగిన సంఘటనల అనంతరం విజయవాడలో చంద్రబాబు పవన్ ను కలిసి సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య పరిరక్షణకే కలిశానంటున్న వీరిద్దరూ రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీచేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

వ్యూహాన్ని అమలు చేస్తున్న జగన్!
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చారు. దీనివల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 35 నుంచి 45 నియోజకవర్గాల్లో లాభపడినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుంటారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంద్వారా వైసీపీకి ఎదుురుదెబ్బలు తగులుతాయని అందరూ భావిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ ఆలోచనా తీరు మాత్రం వేరుగా ఉంది. పదే పదే పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా ఎంచుకోవడంద్వారా ఒక వ్యూహాన్ని జగన్ అమలు చేస్తున్నారు.

కాపుల ఓట్లన్నీ గుంపగుత్తగా పడవు..
కాపుల్లో పవన్ కల్యాణ్ పై సానుకూల అభిప్రాయం లేదని జగన్ భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీచేసినా కాపుల ఓట్లన్నీ గుంపగుత్తగా జనసేనకు పడే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీతో కలవడంద్వారా కాపుల ఓట్లన్నీ హోల్ సేల్ గా చంద్రబాబుకు తాకట్టుపెడుతున్నారనే ప్రచారం చేయవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ అంటే వ్యతిరేకించే కాపులు గత ఎన్నికల్లో జనసేనకు ఓటేశారు. ఈసారి వారిద్దరూ పొత్తు పెట్టుకోవడంవల్ల కాపుల ఓట్లలో సింహభాగం వైసీపీకి మళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఎంత త్వరగా కలిస్తే అంత మంచిది!
పవన్ కల్యాణ్ సాధ్యమైనంత త్వరగా చంద్రబాబుతో కలవడం, ఎన్నికల ప్రచారం చేయడం వంటివి తనకు మేలు చేస్తాయని భావిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కూడా కాపులు కాంగ్రెస్ కు ఓటు వేశారని గుర్తుచేస్తున్నారు. తర్వాత అది కాంగ్రెస్ లో విలీనం కావడంద్వారా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోల్పోయామనే భావనలో ఇప్పటికీ ఆ సామాజికవర్గం ఉంది. పవన్ కల్యాణ్ ద్వారా అది నెరవేరుతుందనుకుంటే చంద్రబాబుకు కాపుల ఓట్లు బదిలీ చేయించడంద్వారా బాబే ముఖ్యమంత్రి అవుతారని, ఈ విషయాన్ని కాపులు గమనంలో ఉంచుకోవాలని చెప్పబోతున్నారు. అంతేకాకుండా మొదటి నుంచి కోస్తాలో కాపు సామాజికవర్గానికి, కమ్మ సామాజికవర్గానికి విరోధం ఉంది కాబట్టి అది తనకు మేలవుతుందనేది జగన్ అంచనా. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూడాలి.!!












Click it and Unblock the Notifications