రసవత్తరంగా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక-కూటమి ఎత్తులతో జగన్ అలర్ట్..! పక్కా ప్లాన్..
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనుంది. ఇవాళ వైసీపీ అభ్యర్దిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నుంచి పోటీ చేసేది ఎవరన్నది ఇంకా తేలలేదు. ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి కూటమి అభ్యర్ధిని చంద్రబాబు తేల్చబోతున్నారు. ఇప్పటికే బైరా దిలీప్ చక్రవర్తికి కూటమి అభ్యర్దిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 838 ఓట్లు ఉండగా.. ఇందులో వైసీపీకి వాస్తవంగా 600కు పైగా ఓట్లు, టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉన్నాయి. అయితే రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇవాళ వైసీపీ అభ్యర్ధి బొత్స సత్యనారాయణ చెప్పిన ప్రకారం చూస్తే వైసీపీ బలం ఇప్పుడు 530కి పడిపోయింది. అలాగే కూటమి బలం పెరుగుతోంది. అయినా అద్భుతం జరిగితే తప్ప కూటమి గెలిచే అవకాశం లేదు. కానీ అధికారంలో ఉండి ఎమ్మెల్సీ సీటు ఓడిపోతే పరువు పోతుంది కాబట్టి కూటమి పార్టీలు వేస్తున్న ఎత్తులు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అలర్ట్ అయ్యారు. ఇప్పటికే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో వరుస భేటీలు అవుతున్నారు. రేపు, ఎల్లుండి కూడా వరుస భేటీలు నిర్వహించాలని నిర్ణయించిన జగన్.. ఈ రెండు రోజులు ఇతరులు ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదని చెప్పేశారు. దీంతో ఈ ఎన్నికను జగన్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతోంది. ఇప్పటికే పలువురు వైసీపీ ఓటర్లను బెంగళూరు తరలించేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంత ఖర్చు పెట్టి అయినా సరే బొత్సను ఎమ్మెల్సీగా గెలిపించి మండలిలో విపక్ష నేత చేయాలన్న ఉద్దేశంతో జగన్ పక్కా వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications