అసైన్డ్ భూములంటే అత్తగారి భూములా: చంద్రబాబుపై జగన్ ఫైర్
మచిలీపట్నం: అసైన్డ్ భూములంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్తగారి భూములని అనుకుంటున్నారా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా భూములను బలవంతంగా తీసుకోవడం దారుణమని ఆయన అన్నారు. ప్రజలకు ఇష్టం ఉంటేనే వారి నుంచి భూములు తీసుకోవాలని ఆయన అన్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటనలో ఉన్న జగన్ బుధవారం తుమ్మలపాలెం రైతులతో సమావేశమయ్యారు. ప్రజల వద్ద నుంచి బలవంతంగా భూములు తీసుకుని ప్రైవేట్ వాళ్లకు ఇచ్చేయడానికి ప్రయత్నం జరుగుతోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. భూములు ఇచ్చేందుకు ప్రజలకు ఇష్టం లేకున్నా ఎందుకు బలవంతం చేస్తున్నారని ఆయన అడిగారు.

ముందు చంద్రబాబు ప్రజల వద్దకు రావాలని, వాళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటేనే తీసుకోవాలని ఆయన అన్నారు. అంతేగానీ బలవంతంగా లాక్కోవడం అన్యాయమని జగన్ అన్నారు. ప్రభుత్వం ఎప్పటికీ ప్రజలకు శ్రీరామరక్షగా ఉండాలని, ముఖ్యమంత్రి అంటే మా ముఖ్యమంత్రి అనుకునేలా ఉండాలి గానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలను మారుస్తామని చెప్పారు. భూములు ఇచ్చేస్తే ప్రజలు ఎలా బతుకుతాని ఆయన ప్రశ్నించారు. పేద ప్రజల భూములు లాక్కునే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
పరిశ్రమల పేరుతో జరుగుతున్న దోపిడీని ఆపాలని ఆయన అన్నారు. కర్మ కాలి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన త్రవాత కృష్ణా డెల్టాకు కూడా కరువు వచ్చిందని అన్నారు.












Click it and Unblock the Notifications