ఇడుపులపాయకి వెళ్తా అనుమతించండి: కోర్టులో జగన్
హైదరాబాద్: తనకు ఇడుపులపాయకు వెళ్లేందుకు అనుమతివ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 1, 2వ తేదీల్లో కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లేందుకు, నాలుగో తేదిన గుంటూరు పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తన పిటిషన్‌లో కోరారు.
తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించేందుకు అక్టోబర్ 1, 2వ తేదీల్లో వెళతానని, అక్టోబర్ 4న గుంటూరులో రైతులు నిర్వహిస్తున్న ర్యాలీ, సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తానని, అనుమతించాలని ఆయన కోరారు. ఆయన పిటిషన్ స్వీకరించిన కోర్టు విచారణను వాయిదా వేసింది.

కాగా, వైయస్ జగన్మోహన్ రెడ్డికి మూడు రోజుల క్రితం సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అందులో హైదరాబాదు విడిచి వెళ్లకూడదనే షరతు ఉంది. ఈ నేపథ్యంలో జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆస్తుల కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరుడు మే 27వ తేదీన అరెస్టయ్యారు. ఆయన పదహారు నెలలు జైలులో ఉన్నారు. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ పది ఛార్జీషీట్లను దాఖలు చేసింది. ఇటీవల దర్యాఫ్తు పూర్తయిందని చెప్పడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications