భూమా ఫ్యామిలీతో ఏ ఆటకైనా సిద్ధం, దమ్ముందా: అఖిలకు చక్రపాణి, నా తండ్రిని చంపారు: వంగవీటి
నంద్యాల ఎస్పీజీ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో వైసిపి నేతలు రోజా, శిల్పా చక్రపాణి రెడ్డి, రెహ్మాన్ తదితరులు మాట్లాడారు.
నంద్యాల: నంద్యాల ఎస్పీజీ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో వైసిపి నేతలు రోజా, శిల్పా చక్రపాణి రెడ్డి, రెహ్మాన్ తదితరులు మాట్లాడారు.

ఆట మొదలైంది: శిల్పా చక్రపాణి
తాను ఈ రోజే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. దమ్ముంటే పార్టీ ఫిరాయించిన వారు కూడా రాజీనామా చేయాలన్నారు. ఈ రోజు నుంచి ఆట మొదలైందన్నారు. ఏ ఆటకైనా మేం సిద్ధమన్నారు. నేను రాజీనామా చేశానని, టిడిపిలో చేరిన వారికి రాజీనామా చేసే దమ్ముందా అని సవాల్ చేశారు. జనమే మాకు దేవుళ్లు అన్నారు. భూమా ఫ్యామిలీ డ్రామా మొదలైందన్నారు. తాము వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల నాడు గెలిచామన్నారు. తాను రాజీనామా చేశానని చెబుతూ శిల్పా చక్రపాణి రెడ్డి తన రాజీనామా పత్రాన్ని జగన్‌కు అందించారు. తమపై ఏమైనా మచ్చ ఉంటే సిబిఐ విచారణ జరిపించుకోవచ్చునన్నారు. ఓ సందర్భంలో మనం మగాళ్లమా, అడవాళ్లమా.. మగాళ్లమే అన్నారు. తనకు అత్యాశ ఉందని లోకేష్ చెప్పారని, కానీ తనకు ఆశనే లేదని చక్రపాణి రెడ్డి చెప్పారు. జగన్ మొండివాడు అయితే, తాను జగమొండి అన్నారు. చంద్రబాబుకు, జగన్‌కు ఒకటే తేడా అన్నారు. చంద్రబాబు చెప్పింది ఏదీ చేయడని, జగన్ చెప్పిన మాట తప్పడన్నారు. ముస్లీంలపై శిల్పా మోహన్ రెడ్డి కేసులు పెట్టించారని ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.
Recommended Video


1988లో నా తండ్రిని పొట్టన పెట్టుకున్న పార్టీ: వంగవీటి
తన తండ్రి 1988లో నిరాహార దీక్ష చేస్తుంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబే పొట్టన పెట్టుకున్నారని వంగవీటి రంగా అన్నారు. ఈ రోజు కాపులకు రిజర్వేషన్ల అంటే చేతకాని దద్దమ్మలా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన ఇచ్చిన హామీలనే తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజన్న అభిమానులు, జగనన్న అభిమానులకు తాను ఒకటే చెబుతున్నానని, అన్న వస్తున్నాడని, ఇక చంద్రబాబు పతనం మొదలైందన్నారు. మీ ఆశీస్సులు ఎల్లవేళలా జగన్‌కు ఉంటాయని కోరుకుంటున్నానని చెప్పారు. విజయవాడలో చెబుతున్న మాయమాటలనే చంద్రబాబు నంద్యాలలో చెబుతున్నారన్నారు.

ఏడాదిలో పార్టీ మారిన అఖిలప్రియ: మల్కిరెడ్డి
వైసిపి గెలుపు కోసం అందరం సైనికుల్లా పని చేస్తామని మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని మంత్రి అఖిలప్రియ చెప్పారని, ఆ తర్వాత ఏడాదికే పార్టీ మారారని చెప్పారు.

ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏమంటే: రెహ్మాన్
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి సైకిల్‌కు పంచర్ చేసి, చంద్రబాబును ఇంటికి పంపించాలని వైసిపి నేత రెహ్మాన్ అన్నారు. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏమంటే.. శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించి, తర్వాత జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. మన కాబోయే ముఖ్యమంత్రి ఎవరు.. ఆరు నూరు అయినా జగన్ సీఎం అన్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. వందమంది చంద్రబాబులు వచ్చినా జగన్‌ను ఆపలేరన్నారు. నా తెలుగు, చంద్రబాబు ఇంగ్లీష్ ఒకేలా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కేబినెట్ సరిగా లేదన్నారు. పప్పు ఉన్నారన్నారు. జగన్ మరో వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు.

ఈ ప్రభంజనం ఉప ఎన్నికల్లో చూపాలి: సులోచన
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపిని గెలిపించి, ఈ ప్రభంజనాన్ని చూపించాలని నంద్యాల మున్సిపల్ చైర్మన్ సులోచన అన్నారు. శిల్పా మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.












Click it and Unblock the Notifications