రాలేను: డిగ్గీకి జగన్ నో, పంచింగ్ బ్యాగ్‌లాంటి వాడినని..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలిసేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నిరాకరించారు. డిగ్గీ చెంప చెళ్లుమనిపించాలని మీడియా సమావేశంలో పేర్కొన్న జగన్.. దిగ్విజయ్ పలకరించే సరికి ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకొన్నారు.
పార్లమెంట్ ఆవరణలో దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతుండగా, జగన్ లోకసభ నుండి బయటకు వచ్చి అటువైపుగా వెళ్తున్నారు. జగన్‌ను చూసిన డిగ్గీ నవ్వుతూ ఇలా రమ్మని పిలిచారు. జగన్ ఒక్కక్షణం అటువైపు చూసి దిగ్విజయ్‌కి ఒక దండం పెట్టి 'నో సర్.. నేను వెళ్తున్నాను. నో సర్.. నేను రాలేను' అని సమాధానమిచ్చి అక్కడి వేగంగా నుంచి నిష్క్రమించారు.

అంతకుముందు తెలంగాణ ఎంపీలు కొందరు 'జగన్ మిమ్మల్ని తిట్టారు. దీనిని సీరియస్‌గా తీసుకోండి' అని దిగ్విజయ్ సింగ్‌ను కోరారు. "నేను నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇలాంటివి నాకు కొత్తకాదు. నిజానికి నేను పంచింగ్ బ్యాగ్ లాంటివాడిని. ఎందరో పంచ్ చేస్తూ ఉంటారు. పంచింగ్ బ్యాగ్ మాత్రం పంచ్ చేయదు. ఎన్ని దెబ్బలు తిన్నా స్థిరంగా ఉంటాను'' అని డిగ్గీ చమత్కరించారు. జగన్‌ది కాంగ్రెస్ డిఎన్ఎ అనే మాటలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
కాగా, ఇటీవల హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ జగన్‌ది కాంగ్రెసు పార్టీ డిఎన్ఏ అని చెప్పగా.. ఆ తర్వాత దానిపై స్పందించిన జగన్.. అలా అన్న డిగ్గీ చెంపపై లాగి కొట్టండంటూ విలేకరులతో అన్నారు. దీనిపై ఇరు ప్రాంతాల కాంగ్రెసు నేతలు భగ్గుమన్నారు.












Click it and Unblock the Notifications