జగన్ అమూల్ అస్త్రం రెడీ- రేపటి నుంచి 3 జిల్లాల్లో రంగంలోకి- టార్గెట్ చంద్రబాబు హెరిటేజ్
ఎక్కడో గుజరాత్‌తో పుట్టి దేశ పాల ఉత్పత్తి రంగంలో అద్భుతాలు సృష్టించిన అమూల్ సంస్ధ రేపటి నుంచి ఏపీలో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తొలి దశలో మూడు జిల్లాల్లో అమూల్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. జిల్లాల్లోని ప్రభుత్వ డెయిరీలతో కలిసి పాల ఉత్పత్తి, మార్కెటింగ్, ఇతర వ్యవహారాలను అమూల్ చేపట్టబోతోంది. రైతు భరోసా కేంద్రాల వేదికగా పాల సేకరణ జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రాజెక్టును సీఎం జగన్ గురువారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు. ఇది విజయవంతమైతే హెరిటేజ్‌తో పాటు ఇతర ప్రైవేటు డెయిరీలకు చుక్కలు కనిపించడం ఖాయమే.

అమూల్ ప్రాజెక్టు రెడీ...
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వాల హయాంలో కుదేలైన డెయిరీ పరిశ్రమను తిరిగి గాడిన పెట్టాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం గుజరాత్‌కు చెందిన సహకార పాల ఉత్పత్తి దిగ్గజం అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలోని పలు జిల్లాల్లో ఉన్న జిల్లా డెయిరీలను గాడిన పెట్టడంతో పాటు వాటికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ వ్యూహాలను అందించేందుకు అమూల్ తోడ్పాటు అందించబోతోంది. దశల వారీగా ఈ కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్న ప్రభుత్వం తొలిదశలో మూడు జిల్లాల్లో అమూల్ కార్యకలాపాలను రేపు ప్రారంభిస్తోంది. ఆ తర్వాత మిగిలిన జిల్లాలకు వీటిని విస్తరిస్తారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తారు.

మూడు జిల్లాల్లో అడుగుపెడుతున్న అమూల్
తొలి దశలో భాగంగా చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో అమూల్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. స్ధానికంగా ఉన్న జిల్లా సహకార డెయిరీలతో కలిసి అమూల్ పాల ఉత్పత్తిలో మెరుగైన పద్ధతులను, మార్కెటింగ్ వ్యూహాలను రచించబోతోంది. ఏపీలో పరిస్ధితులకు తగినట్లుగా ఈ వ్యూహాలు ఉండాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో డెయిరీలు కుదేలైన మూడు జిల్లాలను ముందుగా ఇందుకోసం ఎంపిక చేశారు. వీటిలో టీడీపీ అధినేత సొంత జిల్లా చిత్తూరు మొదటి స్ధానంలో ఉంది. ఒకప్పుడు చంద్రబాబు తన సొంత సంస్ధ హెరిటేజ్ కోసం ఇక్కడ సహకార డెయిరీలను కుదేలు చేశారని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. దీంతో చిత్తూరు జిల్లాలో అమూల్ కార్యకలాపాలు ప్రాదాన్యం సంతరించుకోనున్నాయి.

రైతు భరోసా కేంద్రాల్లోనే పాల సేకరణ...
ప్రభుత్వం రైతులకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట కల్పించేందుకు వీలుగా గతేడాది రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించింది. ఇందులో ఇప్పటికే రైతులకు అవసరమైన సమాచారంతో పాటు విత్తనాలు, ఎరువులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో ఈ రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వీటిలో పాల సేకరణను కూడా మరో అంశంగా చేర్చబోతున్నారు. రైతు భరోసా కేంద్రాలకు వచ్చి పాల రైతులు తమ ఉత్పత్తిని అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇలా సేకరించిన పాలను ప్రభుత్వ డెయిరీలకు తరలించి ప్రాసెసింగ్ పూర్తి చేసి అమ్మేందుకు వీలు కల్పిస్తారు. ఇందులో అమూల్ పాత్రే కీలకంగా మారబోతోంది.

చంద్రబాబు హెరిటేజ్ టార్గెట్‌గా..
ఏపీలో ప్రస్తుతం రైతులు తాము ఉత్పత్తి చేసిన పాలను ప్రభుత్వ డెయిరీల కంటే ప్రైవేటు డెయిరీలకే అందించేందుకు మొగ్గు చూపుతున్నారు. గిట్టుబాటు ధర, నాణ్యత, స్ధానిక రాజకీయాలు, ఇలా పలు అంశాలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వ డెయిరీల కంటే ఎక్కువగా ప్రైవేటు రంగంలో ఉన్న హెరిటేజ్‌తో పాటు ఇతర డెయిరీలకు పాలను వారు అమ్ముతున్నారు. ఇలా అమ్మడం వల్ల ప్రభుత్వ డెయిరీలకు కేవలం 24 శాతం పాలు మాత్రమే చేరుతున్నాయి. మిగతా పాలు ప్రైవేటు డెయిరీలకు వెళ్లిపోతున్నాయి. దీంతో వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా తోడ్పాటు ఇవ్వాలని భావిస్తోంది. ముందుగా చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లోని సహకార డెయిరీలకే రైతుల నుంచే పాలు చేరే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇది విజయవంతమైతే చంద్రబాబు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ డెయిరీకి కష్టాలు తప్పవు. హెరిటేజ్ ఒక్కటే కాదు మిగతా ప్రైవేటు డెయిరీలకూ ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది.