ఏపీలో రాజధానుల రగడ-అసెంబ్లీ రద్దుకు జగన్ మొగ్గుచూపుతారా ? ఫలించని రాజీనామాస్త్రం !
ఏపీలో అమరావతి రాజధాని వర్సెస్ మూడు రాజధానుల పోరు అంతకంతకూ తీవ్రమవుతోంది. దీంతో పాటే ఎవరి వాదనను వారు సమర్ధించుకుంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అమరావతి రైతులు ఇప్పటికే పాదయాత్ర సాగిస్తుంటే, రేపటి నుంచి నాన్-పొలిటికల్ జేఏసీతో కలిసి మూడు రాజధానుల పోరు తీవ్రం చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. అదే సమయంలో వైసీపీ సంధించిన రాజీనామాస్త్రం ఫలించినట్లు కనిపించడం లేదు. దీంతో ఏకంగా అసెంబ్లీ రద్దుకు జగన్ వెళ్లొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

ఏపీలో రాజధానుల పోరు
ఏపీలో రాజధానుల పోరు ముదురుతోంది. ఇన్నాళ్లూ టీడీపీ అమరావతి రాజధానిని, వైసీపీ మూడు రాజధానులకు అండగా నిలిచినా.. ఓసారి రాజధానిగా ఎంపికైన అమరావతిని మార్చడం ఎందుకున్న భావన ప్రజల్లో ఉండేది. అయితే చంద్రబాబు అమరావతిని తన మనుషుల కోసం ఏర్పాటు చేసుకున్నారన్న వైసీపీ ప్రచారం, అదే సమయంలో మూడు రాజధానులతో అందరికీ న్యాయం చేస్తామన్న హామీతో అధికార పార్టీ ముందుకెళ్తోంది. దీంతో అమరావతి రైతులు కూడా గట్టిగా ప్రతిఘటించేందుకు న్యాయస్ధానాల్ని ఆశ్రయించి ఊరట పొందారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై మరోసారి ముందుకెళ్లకుండా పాదయాత్రలు చేసి ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో అధికార పార్టీ కూడా మూడు రాజధానుల్ని జనం కోరుకుంటున్న విషయాన్ని నిరూపించేందుకు ప్రయత్నిస్తోంది.

రాజీనామాస్త్రం సంధించిన వైసీపీ
విశాఖ కేంద్రంగా మూడు రాజధానుల ఏర్పాటుకు నాన్-పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయించిన వైసీపీ.. దీన్ని వాడుకుని రాజకీయ వేడిని రగిల్చేందుకు తమ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో రాజీనామా చేయించింది. అదే సమయంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడైన టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని ధర్మశ్రీ డిమాండ్ చేశారు. కానీ స్పీకర్ ఫార్మాట్ లోనే ఉన్న కరణం రాజీనామాను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. దీంతో గతంలోలాగే ఈ రాజీనామాలు కూడా డ్రామా అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీన్ని సమర్ధించుకునేందుకు వైసీపీ ఏం చేయబోతోందన్న చర్చ పెరుగుతోంది.

అసెంబ్లీ రద్దు కోరిన టీడీపీ
ఒక్కో ఎమ్మెల్యే రాజీనామా చేయడమెందుకు, ఏకంగా అసెంబ్లీనే రద్దు చేయండి ఎన్నికలకు వెళ్లిపోదామని టీడీపీ ప్రతిపాదిస్తోంది. గతంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు ముందస్తు ఎన్నికల డిమాండ్లుచేశారు. అసెంబ్లీ రద్దుచేసి ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీ ఓటమి ఖాయమని ప్రచారం చేశారు. కానీ రెండేళ్ల ముందే అసెంబ్లీ రద్దు చేయడానికి వైసీపీకి ఎలాంటి కారణం కనిపించలేదు. ముఖ్యంగా ఐదేళ్లు పాలించేందుకు ప్రజలు అధికారమిస్తే రెండేళ్లముందే అసెంబ్లీ రద్దుచేయాల్సిన అవసరమేంటనే ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వైసీపీ దీనికి మొగ్గుచూపలేదు.

అసెంబ్లీ రద్దుకు జగన్ మొగ్గుచూపుతారా ?
అయితే రాజధానులపై ఇప్పటివరకూ టీడీపీ కోరినట్లుగా అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే విషయంలో జగన్ కు తీవ్ర వ్యతిరేకత ఉండేది. దీంతో ఐదేళ్ల పాలన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని పార్టీ భేటీల్లో నేతలకు క్లారిటీ ఇచ్చేశారు. కానీ ఇప్పుడు పరిస్ధితి వేరు. రాజధానుల పోరు ముదురుతున్న వేళ రాజీనామాల అస్త్రం సంధించిన వైసీపీపై టీడీపీ అదే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఒక్కొక్క రాజీనామా ఎందుకు ఏకంగా అసెంబ్లీనే రద్దు చేయమని అచ్చెన్నాయుడు ఇవాళ డిమాండ్ చేశారు. దీంతో ఈసారి అసెంబ్లీ రద్దుకు జగన్ మొగ్గుచూపేందుకు తగిన కారణాలు కనిపిస్తున్నాయి. మరి జగన్ అందుకు సిద్ధంగా ఉన్నారా అంటే అవుననే సమాధానం కూడా వినిపిస్తోంది. ఆరునెలల క్రితమే ముందస్తు దిశగా వైసీపీని సిద్ధం చేసిన జగన్.. గడప గడప కార్యక్రమాన్ని కూడా చురుగ్గా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు తప్పనిపరిస్ధితుల్లో అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చినా జగన్ సిద్ధంగానే ఉన్నారు. దీంతో జగన్ నిర్ణయంపై ఇప్పుడు ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications