జగన్ పాదయాత్ర పున:ప్రారంభం...ఆపిన చోటు నుంచే మళ్లీ ముందుకు!
Recommended Video

విజయనగరం:ప్రతిపక్షనేత, వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విరామం తరువాత పున:ప్రారంభమైంది. గత నెల 25న విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనపై హత్యాయత్నంతో గాయపడిన జగన్ చికిత్స, అనంతర విశ్రాంతి నేపథ్యంలో పాదయాత్రకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.
17 రోజుల విశ్రాంతి అనంతరం విజయనగరం జిల్లాలో జగన్ సోమవారం ఉదయం తాను గతంలో పాదయాత్రను నిలిపిన సాలూరు నియోజకవర్గం పాయకపాడు నుంచి పున: ప్రారంభించారు. దాడి అనంతరం మళ్లీ పాదయాత్ర కోసం తమ అభిమాన నేతను చూసేందుకు జగన్ అభిమానులు, వైసిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి ఆశీర్వాదాలు స్వీకరించిన అనంతరం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు.

పాదయాత్ర...పున:ప్రారంభం
జగన్ 295 వ రోజు పాయకపాడు నుంచి మేలపువలస, మక్కువ క్రాస్ రోడ్డు, ములక్కాయవలస మీదుగా కాశీపట్నం క్రాస్ రోడ్డు వరకు కొనసాగుతుంది. అక్కడ జగన్ లంచ్ బ్రేక్ తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రాదయాత్రను ప్రారంభించి పాపయ్యవలస మీదుగా కొయ్యనపేట వరకు కొనసాగించడంతో నేటి పాదయాత్ర పూర్తవుతుంది.

11 జిల్లాల్లో పూర్తి...ప్రస్తుతం 12 వ జిల్లా
జగన్ పాదయాత్ర ఇప్పటివరకు 11 జిల్లాల్లో పూర్తయి ప్రస్తుతం 12 వ జిల్లా విజయనగరంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు జగన్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రజాసంకల్పయాత్రను పూర్తి చేశారు.

విజయనగరం జిల్లాలో...ఇలా సాగనుంది...
ప్రస్తుతం పాదయాత్ర జరుగుతున్న విజయనగరం జిల్లా మినహా మరొక్క జిల్లా శ్రీకాకుళంలో మాత్రమే జగన్ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగాల్సివుంది. విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్ర శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో పూర్తి కాగా ప్రస్తుతం సాలూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇంకా ఇదే జిల్లాలో పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో పాదయాత్ర జరపాల్సివుంది.

శ్రీకాకుళంతో...పాదయాత్ర పూర్తి
విజయనగరం జిల్లాలో పాదయాత్ర ముగిసాక చిట్టచివరి జిల్లాగా జగన్ శ్రీకాకుళంలో ప్రజాసంకల్పయాత్ర కోసం అడుగుపెడతారు. జగన్ ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించి నవంబర్ 6 కు ఏడాది పూర్తవగా మొత్తం మీద పాదయాత్ర ద్వారా మొత్తం ఇప్పటి వరకు 3,211.5 కిలోమీటర్ల దూరం నడిచారు.












Click it and Unblock the Notifications