జగన్ విమానంలో సాంకేతిక లోపం-గన్నవరం ఎయిర్ పోర్టుకు రిటర్న్- ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీకి బయలుదేరిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బయలుదేరిన కాసేపటికే తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

రేపు ఢిల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టెన్ రైజర్ ఈవెంట్ లో పాల్గొనేందుకు సీఎం జగన్ ఇవాళ మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. సీఎం జగన్ తో పాటు ఈ విమానంలో సీఎం జవహర్ రెడ్డి, పలువురు అధికారులు కూడా వెళ్లారు. అయితే విమానం బయలుదేరిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే పైలట్లు విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టుకు మళ్లించారు. అత్యవసరంగా ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది.
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి సీఎం జగన్ ప్రత్యేక విమానం సాయంత్రం 5.03 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది. తిరిగి 5.20కి ఎయిర్ పోర్టుకు తిరిగి వచ్చి అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో విమానం నుంచి బయటికి వచ్చిన సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి ఎయిర్ పోర్టు లాంజ్ లోకి వెళ్లారు. సీఎంకు మరో విమానం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే చీకటి కావడంతో వెంటనే మరో విమానం ఏర్పాటు చేసేందుకు వీల్లేకుండా పోయినట్లు సమాచారం. దీంతో సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు. రేపు ఉదయం ఢిల్లీకి సీఎం జగన్ బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశంకోసం ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంపై సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఏసీ వాల్వ్‌లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్ సమస్య తలెత్తిందని పైలట్ గుర్తించినట్టుగా ప్రాథమికంగా తెలిసిందని అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించిన పైలట్ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ పర్యటనకోసం ముఖ్యమంత్రి, అధికారుల బృందం సాయంత్రం 5:03 గంటలకు టేకాఫ్ అయ్యింది. కాసేపటికే పైలట్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి సాయంత్రం 5:27 గంటలకు గన్నవరంలో ల్యాండ్ అయ్యారు. సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం తిరిగి సీఎం ఢిల్లీకి వెళ్లనున్నట్టు సీఎంఓ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications