చంద్రబాబు, పవన్ పై జగన్ సెటైర్లు-కాంగ్రెస్ గెలిస్తే మీకు పండగా-బీజేపీతో పొత్తు కోరుకుంటూ..
ఏపీలో వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ మత్సకార భరోసా నిధుల్ని సీఎం వైఎస్ జగన్ ఇవాళ విడుదల చేశారు. బాపట్ల జిల్లా
నిజాంపట్నంలో సీఎం జగన్ ఈ నిధుల్ని ఐదోసారి విడుదల చేశారు. ఇవాళ రూ.231కోట్లను మత్సకారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున విడుదల చేశారు. దీంతో కలిపి ఈ ఐదేళ్లలో మొత్తం రూ.538 కోట్ల సాయం లబ్దిదారులకు అందినట్లు సీఎం జగన్ వెల్లడించారు.
చంద్రబాబు, పవన్ పొత్తుల్ని, ఎత్తుల్ని,కుయుక్తుల్ని నమ్ముకున్నారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదన్నారు. కానీ చంద్రబాబు పేరు చెబితే గర్తుకొచ్చేది వెన్నుపోటే అన్నారు. రెండు సినిమా షూటింగ్స్ మధ్యన రాజకీయ సభలు పెట్టడానికి పవన్ కళ్యాణ్ వస్తారని, అదీ బాబు కాల్షీట్ల ప్రకారమే మాట్లాడి రెండు రాళ్లు వేసి వెళ్లిపోతాడన్నారు. ఇలాంటి వారికి ప్రజా జీవితం అంటే తెలుసా అని జగన్ ప్రశ్నించారు. వీరిద్దరూ అధికారంలో ఉంటే అమరావతి, అధికారం పోతే హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో ఉంటారు.

చంద్రబాబు, ఆయన పార్టీ వెంటిలేటర్ పై ఉన్నారని, నలుగురు లేపితే తప్ప లేవలేని పరిస్ధితి ఉందని జగన్ విమర్శించారు.
రాజకీయ పార్టీ పెట్టి పదేళ్లయినా పవన్ కళ్యాణ్ 175 సీట్లలో అభ్యర్ధుల్ని కూడా పెట్టలేని పరిస్ధితిలో ఉన్నారన్నారు. ఒక్కో ఎన్నికకూ ఒక్కో రేటుకు పార్టీని అమ్ముకునే ప్యాకేజీ స్టార్ అన్నారు. ముఖ్యమంత్రి సీటు కూడా వద్దని, దోపిడీలో వాటా వస్తే చాలని పవన్ అంటున్నారని జగన్ విమర్శించారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఎందుకు కలుస్తున్నారో ఆలోచించాలని ప్రజల్ని సీఎం జగన్ కోరారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి, పంచుకోవడానికి వీరంతా కలుస్తున్నారన్నారు. మరోవంక తాను ఎన్ని కష్టాలొచ్చినా, అవమానాలు ఎదురైనా, ఎన్ని వ్యవస్ధల్ని ప్రయోగించినా ఈ 15 ఏళ్లలో మీ తరఫునే నిలబడ్డాడు కానీ రాజీపడలేదన్నారు. మీ బిడ్డకు ధైర్యం మీరేనని, మిమ్మల్నే నమ్ముకున్నాడని జగన్ తెలిపారు.

బీజేపీతో పొత్తు పెట్టుకుందీ వీరే, కాంగ్రెస్ తో అంటకాగిందీ, కమ్యూనిస్టులతో కలిసి సాగిందీ వీరేనని టీడీపీని ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకునేదీ వీరే, విడాకులు తీసుకునేది వీరే, మళ్లీ పెళ్లి చేసుకునేదీ వీరేనన్నారు. దత్తతండ్రికీ, దత్తపుత్రుడికీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఏ స్దాయిలో ఉందంటే మనిద్దరం కలిసి వెళ్దామంటే చిత్తం అంటారన్నారు. విడివిడిగా వెళ్దామని చంద్రబాబు చెబితే పవన్ అలాగే సార్ అంటారన్నారు. చంద్రబాబు ఏం చెబితే దానికి పవన్ సై అంటారన్నారు.
కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ చంద్రబాబు విజయంలా పండుగ చేసుకుంటున్నారని, అక్కడ ఓడిన బీజేపీ తమతో కలిసి రావాలని టీడీపీ కోరుకుంటోందని జగన్ విమర్శించారు. ఇలాంటి నీచ రాజకీయాల్ని చూడాల్సి వస్తోందన్నారు. పేదలపై ఇది పెత్తందార్లు చేసే యుద్ధంగా జగన్ అభివర్ణించారు. వీరిది రాజకీయ పోరాటం కాదని, అధికారం కోసం ఆరాటమన్నారు. వీరికి పేదలకు మంచి చేయాలన్న తపన లేదని, రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, దోచుకున్నది ఎలా దాచుకోవాలి, దాచుకున్నది ఎలా పంచుకోవాలన్నదే వీరి తాపత్రయం అన్నారు.












Click it and Unblock the Notifications