చంద్రబాబుకు దేవుడు మొట్టికాయ వేశాడు: జగన్
కడప: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఒత్తిడి పెట్టి, భయపెట్టి ఎనిమిది మంది కౌన్సిలర్లను తమ పార్టీ వైపు తిప్పుకున్నారని, అయినా దేవుడు చంద్రబాబుకు మొట్టికాయ వేసి తమ పార్టీని గెలిపించాడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నాలుగు జిల్లా పరిషత్తుల్లో తమ పార్టీ గెలిస్తే యుద్ధవాతావరణం సృష్టించి తెలుగుదేశం పార్టీ గెలుచుకునేందుకు ప్రయత్నించిందని ఆయన చెప్పారు. కడప తప్ప కర్నూలు, ప్రకాశం, నెల్లూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏకంగా జెడ్పిటీసిలకు ఫోన్లు చేసి మాట్లాడే స్థాయికి దిగజారారని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని అనుకునేవారు కాలగర్భంలో కలిసిపోయారని, చంద్రబాబు నాయుడు కూడా అంతే అవుతారని ఆయన అన్నారు. చంద్రబాబు వంటి నియంతలు ఎక్కువ కాలం నిలబడరని ఆయన అన్నారు. జమ్మలమడుగు కౌన్సిలర్లతో జగన్ మంగళవారంనాడు సమావేశమై ప్రసంగించారు.
ఎర్రగుంట్లలో 20 కౌన్సిలర్ స్థానాలకు 18 స్థానాలు తమ పార్టీ గెలుచుకుందని, అయితే ప్రజాస్వామ్యం కుంటుపడి కౌన్సిలర్లు, జెడ్పిటీసి, ఎంపిటీసిలు క్యాంపులను నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.
చంద్రబాబు చేతిలో మోసపోయిన రైతులు, విద్యార్థులు, ప్రజలే నిజమైన ప్రతిపక్షమని ఆయన అన్నారు. రాబోయే కాలంలో వారే చంద్రబాబును నిలదీస్తారని ఆయన హెచ్చరించారు. త్వరలో రాష్ట్రపతిని, ప్రధానిని కలుస్తామని చెప్పారు. కౌన్సిలర్లతో కలిసి పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అందరం కలిసికట్టుగా నడుద్దామని జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications