అమరావతి పై జగన్ తాజా సంకేతాలు, కీలక మలుపు..!!
అమరావతి కేంద్రంగా ఏపీ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. రెండో విడత భూ సమీకరణ పై ఏపీ ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. రైతుల నుంచి వస్తున్న స్పందనకు అనుగుణంగా నడుచు కోవాలని డిసైడ్ అయింది. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ అమరావతిలో నిర్మాణ ఖర్చు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో పలు పంటలు పండిస్తున్న రైతుల గురించి ప్రస్తావన చేసిన జగన్.. అమరావతి రైతులు భూ సమీకరణ విషయంలో చేస్తున్న అభ్యంతరాల ఊసెత్తక పోవటం ఇప్పుడు రాజకీయ చర్చగా మారుతోంది.
కీలక పరిణామం
మాజీ సీఎం జగన్ సుదీర్ఘ మీడియా సమావేశంలో పలు ప్రాంతాల్లోని రైతుల సమస్యల పైన మాట్లాడారు. తాము వారికి ఎలా మద్దతుగా నిలిచిందీ వివరించారు. అదే సమయంలో చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేసారు. రాజధాని అమరావతి లో నిర్మాణం గురించి ప్రస్తావన చేసారు. తాను సీఎం గా ఉన్న సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనతో.. అమరావతి లో గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అవినీతి చేసారని జగన్ పెద్ద ఎత్తున ఆరోపించారు. జగన్ సీఎం అయిన తరువాత మూడు రాజధానుల ప్రతిపాదన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా, తాజా ఎన్నికల్లో మాత్రం ఈ ప్రతిపాదనకు జనం మద్దతు లభించ లేదు. దీంతో, జగన్ తన మనసు మార్చుకున్నట్లు స్పష్టం అవుతోంది.

జగన్ వ్యాఖ్యలతో
నేరుగా అమరావతికి జగన్ అనుకూలం అని చెప్పకపోయినా.. పరోక్షంగా అవే సంకేతాలు ఇస్తున్న ట్లుగా వరుస మీడియా సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం తన మీడియా సమావేశంలో గుంటూరు - విజయవాడను కలుపుతూ రాజధాని నిర్మాణం చేపడితే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల తరువాత అమరావతి గురించి ఇప్పటి వరకు ఎక్కడా వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో అమరావతి నిర్మా ణ ఖర్చు గురించి మాత్రం వ్యాఖ్య చేసారు. అంత ఖర్చు చేసి బంగారంతో నిర్మాణం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం అమరావతిలో రెండో విడత భూ సమీకరణ పైన ప్రభుత్వ ఆలోచన లు.. రైతుల స్పందన పైన జగన్ మాట్లాడలేదు.
సంకేతాలు క్లియర్
ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ ఇక తన నిర్ణయం మార్చుకున్నట్లు తాజా సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. ఈ లోగా రాజధాని నిర్మాణం ఒక రూపు రావటం ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా.. ఇప్పటికే జగన్ తిరిగి అధికారంలోకి వస్తే రాజధాని భవిష్యత్ ఏంటంటూ పలువురు తమను ప్రశ్నిస్తున్నట్లు టీడీపీ నేతలు చెప్పటం కూడా రాజకీయం గా చర్చ సాగుతోంది. ఈ సమయంలో రాజధాని విషయంలో రానున్న రోజుల్లో జగన్ తన వైఖరి పైన మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కాగా.. నిర్మాణ ఖర్చు, టెండర్ల విషయంలో మాత్రం జగన్ పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో నిర్మాణాల పైన మరింత స్పష్టత వచ్చిన తరువాత.. జగన్ తన వైఖరి అధికారికంగా వెల్లడించే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications