విధేయతకు పట్టంలో జగన్ కొత్త రికార్డులు- నేతలకే కాదు అధికారులకూ ! భవిష్యత్ రాజకీయం ?
ఏపీలో వైసీపీ స్ధాపన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. ఈ పదేళ్లలో వైసీపీకి అండగా నిలిచిన రాజకీయ నేతలు వందల సంఖ్యలో ఉన్నారు. అదే సమయంలో పార్టీకి వివిధ రూపాల్లో సహకరించిన వారు ఉన్నారు. అలాగే అధికారులు కూడా ఉన్నారు. ప్రత్యర్ధి పార్టీ ప్రభుత్వాలు ఉన్నా తమకు అండగా నిలిచిన అధికారులు, సూచనలు, సలహాలు ఇచ్చిన వారు ఉన్నారు. ఇలాంటి విధేయులందరినీ గుర్తుపెట్టుకుని మరీ సీఎం జగన్ పదవులు కట్టబెడుతున్న తీరు కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

విధేయతకు జగన్ పట్టం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి రావడంతో భారీగా అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా తొలిసారే భారీ మెజారిటీతో ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజకీయ పదవులు, నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పదవుల విషయంలో భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే అందరికీ ఒకేసారి పదవులు కల్పించడం కష్టం కాబట్టి సీఎం జగన్ వరుసగా పదవులు కట్టబెడుతూ వచ్చారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, నామినేటెడ్ పదవులు, సలహాదారు పదవులు ఇలా వందల సంఖ్యలో పదవులు విధేయులకు కట్టబెట్టారు. అలాగే విధేయత చూపిన అధికారులకు సైతం అదే స్ధాయిలో జగన్ పదవులిచ్చారు. అయినా ఎక్కడో చిన్న అసంతృప్తి. దీంతో జగన్ పదవుల పందేరం ఇంకా కొనసాగుతోంది.

బద్దలవుతున్న రికార్డులు
విధేయులకు పదవులు కట్టబెట్టడంలో జగన్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా.. సలహాదారు పదవుల పంపకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వంలో అధికారులకు కల్పిస్తున్న పదవులు కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. వైసీపీకి, జగన్ కు విధేయులుగా ఉంటే చాలు ఎంతవరకైనా వెళ్లొచ్చన్న స్ధాయిలో కల్పిస్తున్న పదవులు ఆశావహుల్లో భారీగా ఆశలు నింపుతున్నాయి. ఇందుకు తగినట్లుగానే పదవుల పంపకాలు సాగిపోతున్నాయి. ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా, పదవులు, జీతం మినహా ఇతర సదుపాయాలు కల్పించే అవకాశాలు తక్కువగానే ఉన్నా పంపకాలు మాత్రం ఆగడం లేదు. దీంతో జగన్ సర్కార్ పదవుల పందేరంలో రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తోంది.

నేతల నుంచి అధికారుల వరకూ
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా రాజకీయ నేతలకు పదవుల పందేరం మొదలుపెట్టిన జగన్.. ఆ తర్వాత క్రమంగా అధికారుల్నీ మార్చుకుంటూ వెళ్లారు. ఇందులో వందల సంఖ్యలో రాజకీయ నేతలు, అధికారులు కీలక పదవుల్లోకి వచ్చేశారు. రాజకీయ నేతల కోసం ఎప్పటికప్పుడు ఉన్న పదవుల్లో నింపుతూనే, కొత్త పదవులు సృష్టించి మరీ వారికి న్యాయం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు వీరి కోసం పలు సందర్భాల్లో కొత్త పదవులు సృష్టించడం కూడా జరుగుతోంది. తాజాగా ఇవాళ రిటైర్ అవుతున్న సీఎస్ సమీర్ శర్మకు సీఎంకు ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ పేరుతో కొత్త పదవి సృష్టించడం దీనికి నిదర్శనం. గతంలోనూ విజయ్ కుమార్, నీలం సహానీ, ప్రవీణ్ ప్రకాష్, శ్రీలక్ష్మి వంటి విధేయులైన అధికారులను కీలక పదవుల్లో నియమించడం లేదా వారి కోసం ప్రత్యేక పదవులు సృష్టించడం చేశారు.

జగన్ ముందు చూపు ?
వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నేతలైనా, అధికారులైనా విధేయత మంత్రం జపించేలా చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అవుతోంది. విధేయులైతే చాలు వారిని అక్కున చేర్చుకోవడం ద్వారా భవిష్యత్తుపై ధీమా కల్పించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో సీఎం జగన్ కోసం ఎందాకైనా వెళ్లేందుకు అధికారులు కూడా సిద్ధమవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్ కోసం కోర్టు మెట్లెక్కేందుకు, నిబంధనలు ఉల్లంఘించేందుకు, ప్రభుత్వం మనసెరిగి ప్రవర్తించేందుకు సిద్ధమైపోతున్నారు. తద్వారా వీరిని భవిష్యత్ అస్త్రాలుగా మార్చుకోవాలన్నది సీఎం జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications