నీ వయసెంత, నువ్వెంత: నోరు అదుపులో పెట్టుకోవాలని జగన్‌కు కళా సూచన
అమరావతి: రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు, వరదలపై కూడా వైయస్ జగన్ బురద రాజకీయాలు చేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని జగన్‌కు సూచించారు.
నీ వయసెంత, నువ్వెంత అంటూ జగన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అయ్యావని విమర్శించారు. ఓ పార్టీ నాయకుడిగా ఫెయిల్ అవ్వడంతో పాటు నువ్వు మాట్లాడిన భాష చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి మనుషులున్నారా?, వీళ్లేనే పార్టీని నడుపుతుందనే బాధ కలుగుతోందన్నారు.

భారీ వర్షాలకు పంట నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత వరదలను కూడా బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన మనసు బురద, మలినంతో కూడుకుని ఉన్నదని వారు మాట్లాడిన భాషను బట్టే అర్ధమవుతుందన్నారు. జగన్ భాష చాలా అభ్యంతరకంగా ఉందన్నారు.
ఏదైనా విషయంపై మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష సభ్యులు దానిపై అవగాహన కలిగి ఉండాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. వరద సహాయచర్యలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వం అసలేమీ చేయట్లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్రంలో విపత్తులు వచ్చిన సమయంలో చంద్రబాబులా మరెవరూ చేయలేరని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications