బాబు చేతిలో జగన్ చిత్తు: అనుభరాహిత్యంతో ఏకపక్షంగా...?
హైదరాబాద్: శాసనసభా వ్యవహారాల్లో ఒక మెట్టు దిగడం అటు మీద పైచేయి సాధించడమనేది ప్రతిపక్ష వ్యూహంగా ఉండాలి. కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాజకీయంగా ఆయన అనుభవ రాహిత్యం బాధపడుతున్నట్లు అర్థమవుతోంది.
దానికితోడు, సీనియర్లను గానీ ఎమ్మెల్యేలను గానీ పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా కలిసి రావడం లేదని తెలుస్తోంది. రోజా విషయంలోనే కాకుండా పిఎసికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన విషయంలో కూడా జగన్ అనుభవరాహిత్యంతో ఏకపక్షంగా వ్యవహరించినట్లు అర్థమవుతోంది.
రోజా విషయంలో మాత్రం వరుసగా జగన్ తప్పులు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. రోజాకు స్పీకర్ పలుమార్లు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకుని తిరిగి సభలో అడుగు పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ప్రివిలేజెస్ కమిటీ ముందు హాజరై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు.

దాంతో ఆ ముగ్గురికి సస్పెన్షన్ గండం తప్పింది. కొడాలి నాని ఇచ్చిన వివరణపై మాత్రం ప్రివిలెజేస్ కమిటీ సంతృప్తి చెందలేదు. రోజా అసలు కమిటీ ముందు హాజరు కాలేదు. రోజా క్షమాపణలు చెప్తే చాలుననే పద్ధతిలో అధికార తెలుగుదేశం పార్టీ సంకేతాలు ఇస్తూనే ఉంది. దీన్ని రోజా వాడుకోకపోవడం వెనక జగన్ వ్యూహం మాత్రమే ఉందని అంటున్నారు.
ఈ విషయాలను పక్కన పెడితే, జ్యోతుల నెహ్రూను పక్కన పెడితే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. ప్రివిలేజెస్ కమిటీ ముందు హాజరై క్షమాపణ చెప్పడానికి వారిద్దరు అనుమతి తీసుకున్నారా, లేదా అనేది తెలియాల్సి ఉంది. జగన్ వారికి అనుమతి ఇచ్చి ఉంటే, రోజాకు వ్యూహాత్మకంగానే అనుమతి ఇవ్వలేదని అనుకోవాలి. ఆ వ్యూహం మాత్రం బెడిసికొడుతోంది.
ముఖ్యమంత్రిపై, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనేది రోజాపై ప్రధానమైన ఆరోపణ. అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, వాటిని ఎదుటివారు ఎత్తిచూపినప్పుడు వెనక్కి తగ్గి సభలో విచారం వ్యక్తం చేస్తే చాలా వరకు వివాదం సద్దుమణుగుతుంది. చట్టసభలో ఇటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి.

అలా చేయకుండా, మంత్రులూ ముఖ్యమంత్రీ తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పట్టించుకోవడం లేదని జగన్ వాదిస్తున్నారు. తాము వెనక్కి తగ్గి, విచారం వ్యక్తం చేసి, అధికార పక్షం అనుచిత వ్యాఖ్యలు ఎత్తిచూపితే ఫలితం ఉండేది. తాము ఎత్తిచూపిన విషయాలపై స్పీకర్ స్పందించనప్పుడు పరిస్థితి మరోలా ఉంటుంది. ఈ వ్యూహప్రతివ్యూహాల్లో ఎక్కడ వెనక్కి తగ్గాలి, ఎక్కడ దూకుడుగా ఉండాలనే విషయం జగన్‌కు అర్థం కాకపోవడానికి అనుభవరాహిత్యమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జగన్‌తో సహా రోజా, ఇంకా పలువురు తొలిసారి శాసనసభలోకి అడుగు పెట్టినవారు. శాసనసభలో ఎలా వ్యవహరించాలనే విషయం వారికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ వాటి విషయంలో అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. అవగాహన పెంచుకుని వ్యవహరించే ఉంటే అధికార పక్షాన్ని నిలదీసే ఎత్తుగడలు, వ్యూహాలు ఫలితం ఇస్తాయి.
శాసనసభ్యులుగా విశేషమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి యనమల రామకృష్ణుడు వంటివారిని ఎదుర్కోవడానికి కేవలం దూకుడు మాత్రమే సరిపోదు. ఎత్తులకు పైయెత్తులు వేయడానికి తగిన విధంగా వ్యవహరించాలంటే సీనియర్లను సంప్రదించి వారి సలహాలను పాటించాల్సి ఉంటుందనే విషయన్ని జగన్ గ్రహించాల్సి ఉంటుంది.
ఇదిలావుంటే, జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి పిఎసికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమకం ఖరారు మాత్రమే కాకుండా సోమవారం జరిగిన శాసనసభా పక్ష సమావేశం కూడా నిదర్శనం. సీనియర్లు ఉన్నప్పటికీ ఎవరినీ సంప్రదించకుండా జగన్ బుగ్గనను నియమించారు. బుగ్గనను నియమించడానికి వెనక గల కారణాలను చెప్పి, తన ఉద్దేశాన్ని చెప్పి సీనియర్లను విశ్వాసంలోకి తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది.
అదే సమయంలో శాసనసభా పక్ష సమావేశంలో ఏం చేయాలనే విషయంపై చర్చించిన జగన్ తన నిర్ణయమేదీ చెప్పలేదు. మంగళవారం సభకు హాజరు కావాలా, వద్దా అనే విషయాన్ని ఆయన తేల్చలేదు. అంటే, ఆయన నిర్ణయం కోసం శాసనసభ్యులు ఎప్పటి వరకు వేచి చూడాలనేది కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్తితిని తట్టుకోవడం శాసనసభ్యులకు కూడా కష్టమే. మొత్తం వ్యవహారంలో జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ అనుభవరాహిత్యంతో వ్యవహరించడం వల్లనే చంద్రబాబు ఎత్తులకు చిత్తువుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications