వైసీపీ నేతల హౌస్ అరెస్టులు.. నోటీసులు
Tirumala Laddu row: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు, చేప నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది వైఎస్ఆర్సీపీ.
ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలంటూ పార్టీ క్యాడర్‌కు ఆదేశాలను ఇచ్చింది. తిరుమల, శ్రీవారి ప్రసాద పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యవహరిస్తోన్నారంటూ మండిపడింది. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో శనివారం నాటి పూజల్లో పాల్గొనాలని సూచించింది.

ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి సేవలో పాల్గొనబోతోన్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
శనివారం ఉదయం 10:30 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. గంట పాటు అక్కడే ఉంటారు. 11:50 నిమిషాలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2:40 నిమిషాలకు బెంగళూరు ఇంటికి చేరుకుంటారు.
వైఎస్ జగన్ నిర్వహించ తలపెట్టిన తిరుమల పర్యటనను దృష్టిలో పెట్టుకుని పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది. ఇప్పటికే తిరుపతిలో సెక్షన్ 30ని అమలులోకి తీసుకొచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా తిరుపతిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదంటూ హెచ్చరించింది.
YSRCP says, "Andhra Pradesh Police, acting on the directions of CM N Chandrababu Naidu and minister Nara Lokesh, have begun issuing notices to YSRCP leaders ahead of Y.S. Jagan Mohan Reddy’s Tirupati tour, warning them not to participate in the event. Many leaders in the region…
— ANI (@ANI) September 27, 2024
అదే సమయంలో తమ నాయకులు, కార్యకర్తలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచినట్లు వైఎస్ఆర్సీపీ వెల్లడించింది. తిరుపతి, తిరుమలకు వెళ్లనివ్వకుండా ఎక్కడికక్కడ తమను అడ్డుకుంటోన్నారంటూ ఆరోపించింది. నోటీసులను సైతం అందజేశారని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని పేర్కొంది. ఎక్కడికక్కడ గృహనిర్బంధంలో ఉంచుతున్నట్లు మండిపడింది.

వైఎస్ జగన్ చేపట్టిన పాప ప్రక్షాళన కార్యక్రమానికి తమ నాయకులు ఎవరూ కూడా హాజరు కాకూడదంటూ పోలీసులు హెచ్చరించారని వైసీపీ విమర్శించింది. ప్రజల శాంతి భద్రతల దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండటానికి ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. పోలీసు యంత్రాంగం మొత్తం కూడా చంద్రబాబు, నారా లోకేష్ కనుసన్నల్లో పని చేస్తోందంటూ వైసీపీ ఆరోపించింది.












Click it and Unblock the Notifications