నిర్ణయం మార్చుకున్న జగన్, ఇక అమీ తుమీ..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయంతో సిద్దమయ్యారు. అసెంబ్లీ సమావేశాల వేళ పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. కొంత కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటుగా.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడుతుండటంతో పార్టీ వైఖరి ఖరారు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. పార్టీ రాజకీయ కార్యాచరణ.. ప్రభుత్వ నిర్ణయాల పైన నిరసనల పైనా జగన్ కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ రోజు సమావేశంలో కీలక నిర్ణయం వెల్లడించనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలను ప్రస్తావించి నిలదీసే విధంగా వ్యవహరించాలని ముఖ్యంగా జగన్ శాసనమండలి సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీకి హాజరు కాకపోవటం పైన పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలకమైన బడ్జెట్ సమావేశాలు కావటంతో పాటుగా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో నిర్మాణం, లడ్డూ వ్యవహారం, భూముల కేటాయింపు, రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో సభకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లాలని భావిస్తే.. ఆ దిశగా జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే అక్కడే నిరసన వ్యక్తం చేసి బయటకు వచ్చి.. మాట్లాడాలని కొందరు సీనియర్లు తమ అభిప్రాయంగా వెల్లడిస్తున్నారు.
భవిష్యత్ కార్యాచరణ ఖరారు
అదే సమయంలో పార్టీ నేతల ఇళ్ల పైన దాడులు.. తిరుమల లడ్డూ వివాదం, మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో నిర్మాణం తో పాటుగా ఈ సారి ప్రతిపాదించే బడ్జెట్ పైనా చర్చ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 14న అసెంబ్లీ లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ సమయంలో సభకు వెళ్లాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు పూర్తి కావటంతో.. ఇక, ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పైన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.
ఈ మేరకు కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. బడ్జెట్ సమయంలో సభకు హాజరు పైన మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకోని నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. శాసనసభను బహిష్కరించి తమ నిరసనను తెలియచేస్తే ఎలా ఉంటుంది? అలాగే సభకు వెళ్లి నిరసన తెలిపి వాకౌట్ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై సీనియర్ నేతల సలహాలు తీసుకుని ఒక నిర్ణయాన్ని నేడు జగన్ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications