వైఎస్ జగన్ కొత్త రోడ్ మ్యాప్
YS Jagan: సిద్ధం పేరుతో బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. దీనికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మేదరమెట్ల సమీపంలో 200 ఎకరాల్లో సభను జరుగనుంది. వైఎస్ఆర్సీపీ నిర్వహించబోయే చివరి సిద్ధం బహిరంగ సభ ఇదే.
ఇంతకుముందు భీమిలీ, దెందులూరు, రాప్తాడుల్లో ఈ సభలను నిర్వహించారు. వాటన్నింటికీ మించిపోయేలా అద్దంకి సిద్ధం సభ ఉండబోతోందని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. 15 లక్షల మంది ఈ సభకు తరలి వస్తారని వైఎస్ఆర్సీపీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా 44 నియోజకవర్గాల నుంచి ప్రజలు ఈ సభకు వస్తారని అంచనా వేసినట్లు వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఇదివరకే స్పష్టం చేశారు. ఈ అయిదు సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్ జనరంజకంగా పరిపాలన సాగించారని, అందుకే స్వచ్ఛందంగా ఈ సభకు జనం తరలివస్తారని అంచనావేశారు.
కాగా- దీని తరువాత వైఎస్ జగన్.. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 16వ తేదీన తొలి సభ ఉంటుందని తెలుస్తోంది. సిద్ధం సభ తరహాలోనే ఉత్తరాంధ్రలో ఈ ఎన్నికల సభలకు శ్రీకారం చుట్టబోతోన్నారాయన. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల తొలి బహిరంగ సభను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దీని తరువాత పోలింగ్ సమీపించేంత వరకు ప్రతి రోజూ బహిరంగ సభలు ఉండబోతోన్నాయి. 175 నియోజకవర్గాల్లో జగన్ రోడ్ షోలు, బహిరంగ సభలను నిర్వహించేలా వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసింది. ప్రతి రోజూ మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను రూపొందించింది.
విస్తృతంగా జనంలోకి వెళ్లేలా ఈ సభల రూట్ మ్యాప్ ఉండబోతోంది. సార్వత్రిక ఎన్నికల కోసం ఈ నెల 13 లేదా 14వ తేదీల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. దీని ఆధారంగానే వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించడానికి ఈ నెల 16వ తేదీన ముహూర్తాన్ని ఖరారు చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications