టిడిపి ఇంచార్జీలకు ఎర: అవమానమంటూ జగన్ గుర్రు
హైదరాబాద్: తమ పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఆయా శాసనసభా నియోజకవర్గాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తమ పార్టీ శాసనసభ్యులు వెళ్లిపోయిన నియోజకవర్గాల్లోని టిడిపి ఇంచార్జీలకు ఆయన గాలం వేస్తున్నట్లు చెబుతున్నారు.
పలువురు టిడిపి శాసనసభ నియోజకవర్గాల టిడిపి ఇంచార్జీలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి రావడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్లు ఇస్తే చాలునని వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో బేరాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, తమ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడిన శాసనసభ్యులను బుజ్జగించేందుకు ప్రయత్నించిన తన పార్టీ నేతలపై జగన్ మండిపడినట్లు సమాచారం. తమ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయిస్తున్న శాసనసభ్యుల పట్ల వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉపేక్ష వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ విధమైన పరిస్థితిలో బొబ్బిలి రాజులు పార్టీ మారుతుంటే వారిని బుజ్జగించడానికి విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరికొందరు కీలక నేతలు వెళ్లారు. వారు తన బొబ్బిలి కోటకు వస్తున్నారని తెలిసినప్పటికీ వారికి అందుబాటులో లేకుండా సుజయకృష్ణ మొహం చాటేశారు. వారు ఫోనులో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.
ఆ నేతలు సుజయ్ కృష్ణ ఇంటి వద్ద కాసేపు నిరీక్షించి ఉత్తచేతుల్తో తిరిగి వచ్చేశారు. దీన్ని పార్టీకి అవమానకరంగా జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారుతున్నట్లు ప్రకటనలు చేసిన వారిని బుజ్జగించడానికి వెళ్లి పరువు పోగొట్టుకునే బదులు మరింత మంది వెళ్లకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications