'జగన్ సారీ చెప్తారా, బాబు సవాల్ స్వీకరిస్తారా': కాళ్లు మొక్కుతానన్నా: సీఎం
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు తెలుగుదేశం, వైసిపి మధ్య తీవ్ర వాగ్యుద్దం జరిగింది. మంత్రులపై జగన్ చేసిన ఆరోపణలు నిరూపించాలని చంద్రబాబు సవాల్ చేశారు. లేదంటే సభ ముందుకు కదలదని చెప్పారు. చంద్రబాబు సవాల్‌ను జగన్ స్వీకరిస్తారా లేదా క్షమాపణ చెబుతారా తేలాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది.
రాయలసీమ పౌరుషం ఉంటే: అచ్చెన్నాయుడు
నీకు ఏమైనా రాయలసీమ పౌరుషం ఉంటే సభా నాయకుడు చంద్రబాబు ఓ సవాల్ చేశారని, దానిని నిరూపించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. దేవినేని, నారాయణ, పత్తిపాటిల పైన భూములు ఉన్నట్లు నిరూపించాలన్నారు. 2004 ఎన్నికలకు ముందు మీరు ఇల్లు తాకట్టు పెట్టి ఎన్నికలకు వెళ్లారన్నారు. ఇప్పుడు ఇంత డబ్బు ఎలా సంపాదించావని ప్రశ్నించారు.
బిజెపి నేతలు ఎందుకు స్పందించరు: చంద్రబాబు
చంద్రబాబు మాట్లాడుతూ... మా సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని, అవతలి వ్యక్తులకు సభలో హుందాతనం లేదన్నారు. అర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కొంతమంది 24 గంటలు అవినీతిలో ఉంటారని, వారిని తిట్టినా ఏం కాదన్నారు. ఏకవచనం మాట్లాడుతారని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
జగన్ పద్ధతి లేకుండా ఏకవచనంతో మాట్లాడుతుంటే బిజెపి సభ్యులు కూడా చూస్తూ ఊరుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభ ముందుకు జరగాలంటే.. మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావుల పైన ఆరోపణలు నిరూపించాలన్నారు. లేదంటే జగన్ పైన చర్యలు తీసుకోవాలన్నారు.
అప్పటి దాకా సభ ముందుకు కదలదన్నారు. మేం తప్పు ఉంటే సవరించుకుంటామని, ప్రజలకు క్షమాపణ చెబుతాన్నారు. మీరు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసుకుంటూ పోతే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. జగన్ చేసిన ఆరోపణలు కచ్చితంగా ఇప్పుడు నిరూపించాలన్నారు.
చంద్రబాబుకు వద్ద రూ.2 లక్షల కోట్లు ఎలా వచ్చాయి: జగన్
1978లో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రెండు ఎకరాలని, ఇప్పుడు ఆయన వద్ద రూ.2 లక్షల కోట్లు ఉన్నాయని, అవి ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. ఆయన మీద కేసులు వేస్తే తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బాబు ఆస్తుల పైన సిబిఐ విచారణ చేయిద్దామా అన్నారు.
చంద్రబాబు సవాల్‌కు జగన్ స్పందిస్తారా లేదా: విష్ణు
బిజెపి సభ్యులు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. అధికార పార్టీ సభ్యులను జగన్ ఏకవచనంతో మాట్లాడటం దురదృష్టకరమన్నారు. సభ హుందాగా సాగాలన్నారు. దేనికీ సంబంధం లేని మాటలను జగన్ మాట్లాడటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి.. జగన్‌కు ఓ సవాల్ విసిరారని, దానిని జగన్ నిరూపించాలన్నారు. కాగా, చంద్రబాబు ఆగ్రహంతో బిజెపి సభ్యుడు తగ్గినట్లుగా కనిపించింది.
కుర్రవాడికి జ్ఞానోదయం కాక: గోరంట్ల
చంద్రబాబు చేసిన సవాల్‌ను జగన్ స్వీకరిస్తున్నారా లేదా చెప్పాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సభలో ఆరోపణలు చేసినప్పుడు వాటిని రుజువు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. బయట ఆయన పేపర్లో, టీవీలో ఆరోపణలు చేయడం వేరని, ఇక్కడ సభలో ఆరోపణలు చేయడం వేరన్నారు.
జగన్ తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా లేదా చెప్పాలన్నారు. ఓ సమయంలో స్పీకర్.. గోరంట్లను మందలించారు. బొండ ఉమ మాట్లాడుతూ... జగన్ చేసిన ఆరోపణలు తేలే వరకు తాము సభలోనే ఉంటామని చెప్పారు.
జగన్ మాట్లాడుతూ... రాజధాని ప్రాంతంలో భూములు కొన్నట్లు పయ్యావుల కేశవ్, దూళిపాళ్ల నరేంద్ర తదితరులు అంగీకరించారని, తాను పేపర్లో చూశానని, ఆరోపణలు వచ్చాయని, వాటిని సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. చంద్రబాబుది ఇన్ సైడర్ ట్రేడింగ్ కన్నా దారుణమన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ... మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావుపై పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. వారి తప్పు తేలితే వారిని డిస్మిస్ చేస్తానని చెప్పారు. ఎక్కడ, ఎవరు కొన్నారు, సర్వే నెంబర్లు ఏవో చెప్పాలన్నారు. లేదా క్షమాపణ చెప్పాలన్నారు.
జగన్ మాట్లాడుతూ... నేను చంద్రబాబును నేరుగా అడిగానని, సిబిఐ చేత విచారణ చేయించాలని అడిగానన్నారు. మీరు ఢిల్లీలో మేనేజ్ చేయగలరని తెలిసీ భయపడుతూనే సిబిఐ విచారణ కోసం అడిగానన్నారు. టిడిపి బినామీలు ముందే భూములు కొన్నాక రాజధానిని లీక్ చేశారన్నారు.
రాజధాని ఎక్కడ వస్తుందో ముందే చెప్పి నీ బినామీల చేత భూమి కొనిపించావని మండిపడ్డారు. కొన్ని సందర్భాలలో చంద్రబాబును ఉద్దేశించి జగన్... 'నువ్వు' అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన ఆస్తులపై సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారన్నారు.
మా పిల్లలను రోడ్డుపైకి గుంజారు: దూళిపాళ్ల
దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... రాజధాని ప్రకటన ఎప్పుడు చేశామో సాక్షి కూడా రాసిందన్నారు. సాక్షి పత్రిక రాజధాని గురించి వార్త ఇచ్చిందని, అలాంటప్పుడు అందులో రహస్యం, గోప్యం ఏమిటన్నారు. రాజధాని ప్రకటన చేశాక భూములు కొనొచ్చు, అమ్ముకోవచ్చు అన్నారు.
వైసిపి తరఫున పోటీ చేసిన వారు, వైసిపి నాయకులు భూములు కొనలేదా చెప్పాలన్నారు. రాజధాని ప్రాంతంలో ఎవరైనా భూములు కొనవచ్చు, అమ్ముకోవచ్చునని ఈ ప్రభుత్వం చెప్పిందన్నారు. అసైన్డు భూముల గురించి జగన్ ఆరోపణలు సరికాదన్నారు.
రాజధాని మీద కక్షతో, ఆ ప్రాంతం పైన ఆయనకు ఉన్న కక్షతో విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మేం ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉన్నామని, కానీ మా పిల్లలు బయట ఎవరికీ తెలియదన్నారు. కానీ సాక్షి పత్రిక మా పిల్లలను బయటకు గుంజిందన్నారు. జగన్ దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు, మరికొందరు భూములు కొన్నారని, వారి పేర్లు బయటకు లాగాలన్నారు. మీరు చేసిన దుష్ప్రచారాల పైన విచారణ చేయించాలనడం విడ్డూరమన్నారు. మీరు దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
జగన్‌కు కూడా పిల్లలు ఉన్నారు..
జగన్‌కు కూడా పిల్లలు ఉన్నారని, రాజకీయాల్లోకి పిల్లలను తీసుకు వస్తే ఆ బాధ ఏమిటో ఆయనకు కూడా తెలుస్తుందన్నారు. రాజధానిలో కుంభకోణంపై ఆధారాలు ఉంటే ఇవ్వాలని దూళిపాళ్ల సవాల్ చేశారు. పదేపదే అబద్దాలు సరికాదన్నారు.
జగన్ మాట్లాడుతూ... ఏ పత్రిక అయినా సాక్షి రాసినట్లుగా రాస్తుందన్నారు. పగిడిపల్లి, నూజివీడు వద్ద రాజధాని రావొచ్చని సాక్షితో పాటు అన్ని పత్రికలు రాశాయన్నారు. అలాగే సాక్షి రాసిందన్నారు. చంద్రబాబు రాజధానిపై ప్రకటన మొదట చేయలేదన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ... ఇన్ సైడ్ ట్రేడింగ్ అని జగన్ చెప్పారని, అదేమిటో నాకు అర్థం కావడం లేదన్నారు. రాజధాని ప్రాజెక్టు ల్యాండ్ పూలింగ్ అన్నారు. రైతలకు తాను ఓ పిలుపునిచ్చానని, నాకు భూములివ్వాలని చెప్పానని, అభివృద్ధి చేస్తానని చెప్పానన్నారు.
రైతులే స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారని, ఇప్పుడు మీరు ఎవరన్నారు. మీకు సంస్కారం లేదని, రైతులకు సంస్కారం ఉందని, అందుకే వారిక కాళ్లకు నమస్కారం పెడతానని చెప్పానని అన్నారు. 54 వేల ఎకరాల్లో ఇన్ సైడ్ ట్రేడింగులో లేదని, దానితో ఎవరికీ సంబంధం లేదన్నారు. ఓ పద్ధతి ప్రకారం మేం పోతున్నామన్నారు.
కొనుక్కున్న దాంట్లో వైసిపి నేతలు కూడా ఉన్నారన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించిందన్నారు. ఇన్ సైడింగ్ ట్రేడింగ్ ఎక్కడ ఉందన్నారు. మీరు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఈ ప్రాజెక్టు ఆగదన్నారు.
మరోసారి జగన్ ఆరోపణలు చేశారని, వాటిని నిరూపించాలన్నారు. పద్ధతి లేకుండా సభలో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మొదట.. నారాయణ, పత్తిపాటిలపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications