
రూటుమార్చిన ఏపీ విపక్షాలు-ఢిల్లీలో జగన్ కు చికాకు ? అక్కడే కౌంటర్లు ఇప్పించే యత్నం !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులపై ఇన్నాళ్లూ రాష్ట్రంలో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి, మీడియాలో వార్తా కథనాల రూపంలో హల్ చల్ చేసిన విపక్షాలు.. ఇప్పుడు రూటుమార్చాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఏపీ అప్పులపై దుమ్మెత్తి పోస్తున్నాయి. అంతే కాదు కేంద్రమంత్రుల్ని ప్రశ్నలడుగుతూ వైసీపీని చికాకుపెడుతున్నాయి. దీంతో వైసీపీ వీటికి కౌంటర్లు ఇప్పించేందుకు ఆర్దికమంత్రి బుగ్గనను అక్కడికి పంపింది.

రూటుమార్చిన ఏపీ విపక్షాలు
ఏపీలో మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాల్ని బహిరంగంగానే తప్పుబడుతూ వస్తున్న విపక్షాలు ఇప్పుడు రూటుమార్చినట్లు కనిపిస్తున్నాయి. ఏపీలో తాము ఏం చెప్పినా జనం నమ్మే పరిస్ధితి లేదని భావిస్తున్నాయో లేక జాతీయ స్ధాయిలో జగన్ ను టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాయో తెలియదు కానీ.. ఈ వార్ ను ఢిల్లీకి మార్చేశాయి. దీంతో ఇప్పుడు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న అప్పులపై అన్ని పార్టీలు చర్చించుకుంటున్నాయి. తద్వారా జగన్ సర్కార్ నిర్ణయాలు జాతీయ స్ధాయిలో చర్చకు తావిస్తున్నాయి.

పార్లమెంటులో ప్రశ్నలతో చికాకుపెట్టే యత్నం
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఇన్నాళ్లూ రాష్ట్రంలో విమర్శలు చేసిన విపక్షాలు ఇప్పుడు పార్లమెంటులో పూర్తిస్దాయిలో ప్రిపేర్ అయి మరీ ప్రశ్నలు సంధిస్తున్నాయి. విపక్ష టీడీపీ, బీజేపీ ఎంపీలతో పాటు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం పార్లమెంటులో కేంద్రాన్ని ఏపీ అప్పులపై ప్రశ్నిస్తున్నారు. దీంతో వైసీపీ ఎంపీలు కూడా నోరెళ్లబెడుతున్నారు. ఆర్ధికాంశాలపై వైసీపీ ఎంపీలు మాట్లాడే సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. దీంతో ఊహించని విపక్షాలదాడితో వైసీపీ ఎంపీలు కూడా ఆత్మరక్షణలో పడుతున్నారు.

కేంద్రంతో చెప్పించే యత్నం
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఇన్నాళ్లూ రాష్ట్రంలో తాము ఎన్ని విమర్శలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం వాటిని లెక్కచేయకపోవడంతో ఇక చేసేది లేక విపక్షాలు కేంద్రాన్నే నమ్ముకున్నట్లు అర్దమవుతోంది. పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ప్రశ్నలు వేయడం ద్వారా కేంద్రం ఏం చేస్తుందనే అంశాన్ని విపక్షాలు తెరపైకి తెస్తున్నాయి. దీంతో కేంద్రం సైతం చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండలేని పరిస్ధితి కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులు సైతం ఏపీ విషయంలో సీరియస్ గానే స్పందిస్తున్నారు. తాజాగా ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు పార్లమెంటులో ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

ఢిల్లీలోనే కౌంటర్లు ఇప్పిస్తున్న జగన్ ?
పార్లమెంటులో వైసీపీని ఇరుకునబెట్టేలా టీడీపీ, బీజేపీతో పాటు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేస్తున్న ప్రశ్నలు, వాటికి కేంద్రం స్పందిస్తున్న తీరుతో జగన్ ఇరుకునపడుతున్నారు. దీంతో పార్లమెంటు వేదికగా ఏపీ ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని జాతీయ మీడియా కూడా ఫోకస్ పెడుతుందని గ్రహించారు. అందుకే ఏపీ ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను ఢిల్లీకి పంపి అక్కడి నుంచే అప్పులపై కౌంటర్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలే లెక్కల్లో దిట్ట అయిన బుగ్గన ఇప్పుడు వాస్తవాల్ని జాతీయ మీడియా ముందు పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తద్వారా వైసీపీకి డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.