3 ఛార్జీషీట్లు: కోర్టుకు వైయస్ జగన్, విజయసాయి రెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో మూడు ఛార్జీషీట్ల పైన కోర్టుకు వచ్చారు. జగన్‌తో పాటు విజయ సాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి తదితరులు వచ్చారు. కేసు విచారణను సీబీఐ కోర్టు మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.
అక్రమాస్తుల కేసులో మూడు చార్జిషీట్లపై విచారణ కొనసాగుతోంది. విచారణ జరుగుతున్న సమయంలో వీరు కూడా డిశ్చార్జ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు డిశ్చార్జ్ పిటిషన్‌ను ఈనెల 9కి వాయిదా వేయగా, అక్రమాస్తుల కేసును మార్చి 6కు వాయిదా వేసింది.

కాగా, వైయస్ జగన్, కర్నాటక రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిలు గత గురువారం ఉదయం నాంపల్లి కోర్టు వద్ద ఎదురయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలకరించుకున్నారు. తనకు ఎదురుపడిన గాలి జనార్దన్ రెడ్డిని చూసిన జగన్.. నమస్కారం పెట్టి, బాగున్నారా అంటూ పలకరించారు. దానికి ప్రతి నమస్కారం పెట్టిన గాలి.. బాగున్నానని చెప్పారు. ఇటీవల బెయిల్ పైన విడుదలైన గాలి తొలిసారి నాంపల్లి సీబీఐ న్యాయస్థానానికి హాజరయ్యారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో గాలికి ఓబుళాపురం మైనింగ్స్ కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. వైయస్ కుటుంబానికి, గాలి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయంటారు.
అయితే, వైయస్ మృతి, కేసుల నేపథ్యంలో ఆ తర్వాత జగన్.. తనకు గాలి జనార్ధన్ రెడ్డి అంతగా తెలియదన్నట్లుగా మాట్లాడారు. దీని పైన అప్పుడు టీడీపీ విమర్శలు కూడా గుప్పించింది. దాదాపు నాలుగేళ్ల క్రితం ఆస్తుల కేసులో అరెస్టైన జగన్ ఏడాది తర్వాత విడుదలయ్యారు. గాలి కూడా అంతకుముందే అరెస్టయ్యారు. గాలి ఇటీవలే విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications