పాలన ఉందా, మనసులేని పాలకులు: జగన్
కాకినాడ: రాష్ట్రంలో పరిపాలన ఉందా, లేదా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రశ్నించారు. తుఫాన్ల వల్ల, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను, ఇతర వర్గాల ప్రజలను ఆయన మంగళవారం పరామర్శించారు. తూర్పో గోదావరి జిల్లాలో దెబ్బ తిన్న పంటలను ఆయన పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. బాధితులను ఆదుకోని ఈ పాలకులకు మనసు ఉందా అని ఆయన అడిగారు.
ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన బాధలను రైతులు జగన్‌కు వినిపించారు. నష్టపోయిన పంటను వారు ఆయనకు చూపించారు రైతుల కష్టాలపై తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాస్తానని జగన్ చెప్పారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు, వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌కు కూడా లేఖలు రాస్తానని ఆయన హామీ ఇచ్చారు.

తుఫాను తాకిడికి నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, రైతుల రుణాలను మాఫీ చేయాలని ఆయన కోరారు. నీలం తుఫాను బాధితులకు కూడా ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని చెప్పారు. రైతులను ఆదుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం చూస్తుంటే బాధ అనిపిస్తోందని జగన్ అన్నారు.
రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద విత్తనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరులో రైతులను ఆయన పరామర్శించారు. అంతకు ముందు ఆయన కొత్తపేట నియోజకవర్గం ఆవిడిలోని హెలెన్ తుఫాను తాకిడి ప్రాంతాలను సందర్శించారు.












Click it and Unblock the Notifications