రాప్తాడు బాలికను పరామర్శించిన జగన్.. 50లక్షల పరిహారంతో పాటు ఆ పనిచెయ్యాలని డిమాండ్!
రాష్ట్రంలో దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలకు అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థినిపై జరిగిన దాడి ఉదాహరణ అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. స్కూల్‌తో సంబంధం లేని వ్యక్తి ఎలక్ట్రిక్ రంపం తీసుకొచ్చి, ఏకంగా క్లాస్‌రూమ్‌లోనే, పిల్లలందరి ముందు పదవ తరగతి విద్యార్థిని గొంతు కోయడం అత్యంత హేయమని ఆయన ఆక్షేపించారు. చివరకు స్కూళ్లలో కూడా పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టెన్త్ విద్యార్ధిని గోపికను వైయస్ జగన్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడిన ఆయన బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. పాప ఆరోగ్యం కాస్త మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పడం, కాస్త సంతోషించతగిన విషయమని, బాలిక పరామర్శ అనంతరం జగన్ మాట్లాడుతూ చెప్పారు.

స్కూళ్లలో చదువుకునే పిల్లల భద్రత ఎక్కడ అని ప్రశ్నించారు. ఇది వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా విస్తరిస్తున్నాయి. గంజాయి, మద్యం అందుబాటులోకి రావడంతో యువత వ్యసనాలకు బానిసలవుతున్నారు. వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ పరిస్థితుల వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని జగన్ పేర్కొన్నారు. వీటిని నియంత్రించలేకపోతున్నందుకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు.
ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ఒక అమాయక బాలిక నేడు చావుబతుకుల మధ్య పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని, బాధిత బాలిక కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల పరిహారం అందించాలి. అంతే కాకుండా బాలికకు అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలను పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో అందించాలని జగన్ డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలవాలన్నారు.
ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాని పక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. బాలిక వైద్యానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ఇవ్వకపోతే, వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆ కుటుంబానికి రూ.50 లక్షలు అందిస్తాం అని జగన్ ప్రకటన చేశారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం అన్నారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేశారు. పోలీసుల దృష్టి శాంతిభద్రతల పరిరక్షణపై కాకుండా రాజకీయ వ్యవహారాలపై ఉండే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు. ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనే గత 15-16 నెలల్లో తొమ్మిది దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు జగన్. వాటిలో ఆరు ఘటనలు మహిళలు, బాలికలకు సంబంధించినవే కావడం ఆందోళనకరం అని పేర్కొన్నారు. ఇది ప్రస్తుత ప్రభుత్వ అసమర్ధతకు, వైఫల్యానికి నిదర్శనం అన్నారు.












Click it and Unblock the Notifications
