చివరి ఓటు లెక్కించేంత వరకూ కౌంటింగ్ కేంద్రాలను వీడొద్దు..!!
స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కు ఇంకొక్క రోజే మిగిలివుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ఆరంభం కానుంది. బ్యాలెట్ పేపర్లను లెక్కించాల్సి రావడం వల్ల ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. పోలింగ్ సమయంలో పలుచోట్ల పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు, పోలీసులు.
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులతో మాట్లాడారు. వారికి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటునూ కాపాడుకునేలా పార్టీ నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. 5న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు.

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ధరల పెరుగుదల, అప్పుల భారం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఆరోగ్య సేవల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనతో పోలిస్తే రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికలను గెలుపోటముల కోణంలోనే చూడకూడదని, రాబోయే సాధారణ ఎన్నికలకు ముందు పార్టీ బలాబలాలను అంచనా వేసుకునే అవకాశంగా భావించాలని సజ్జల సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ పనితీరు, నియోజకవర్గ సమన్వయకర్తల పట్టు, ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత, తమ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా, అన్ని టేబుళ్ల వద్ద ఓట్ల లెక్కింపు స్పష్టంగా రికార్డవుతోందా అనే అంశాలను ఏజెంట్లు ముందుగానే పరిశీలించాలని సజ్జల సూచించారు. కెమెరాలు పనిచేయకపోతే అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసి, లోపాలను సరిచేసిన తర్వాతే కౌంటింగ్ కొనసాగించాలని డిమాండ్ చేయాలని చెప్పారు. పోలింగ్, కౌంటింగ్, స్ట్రాంగ్‌రూమ్‌లకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని భద్రపరచాలని, ఎన్నికల పిటిషన్లలో ఈ ఆధారాలు కీలకమవుతాయని చెప్పారు.
అలాగే బ్యాలెట్ బాక్సుల సీళ్లు చెక్కుచెదరకుండా ఉన్నాయా, పోలింగ్ ఏజెంట్ల సంతకాలు సక్రమంగా ఉన్నాయా అనేది తప్పనిసరిగా పరిశీలించాలని అన్నారు. ఏవైనా అనుమానాలు, లోపాలు కనిపిస్తే వెంటనే అభ్యంతరం తెలియజేసి, సంబంధిత బాక్సులను పక్కన పెట్టాలని కోరాలన్నారు. బ్యాలెట్ పత్రాల లెక్కింపు, ఓట్ల కట్టలు కట్టే సమయంలో ఒక అభ్యర్థికి వచ్చిన ఓట్లు మరో అభ్యర్థి ఖాతాలోకి వెళ్లకుండా ప్రతి దశలో జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.
కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం నుంచి తుది ఫలితాలు ప్రకటించి, లెక్కలను పరిశీలించి, అవసరమైన పత్రాలపై సంతకాలు చేసే వరకు కేంద్రాలను విడిచిపెట్టకూడదని స్పష్టం చేశారు. ప్రతి అభ్యంతరాన్ని లిఖితపూర్వకంగా నమోదు చేయడంతో పాటు ఫిర్యాదు ప్రతులను భద్రపరచుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో అనుభవం, ధైర్యం, పట్టుదల ఉన్న ఏజెంట్లను నియమించాలని, అధికారులు అడ్డుకుంటే వెంటనే బయట ఉన్న పార్టీ నాయకులకు సమాచారం అందించాలని చెప్పారు.














Click it and Unblock the Notifications
