ముగిసిన టైమ్: రేపే జైలు నుంచి జగన్ విడుదల
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు (మంగళవారం) మాత్రమే హైదరాబాదులోని చంచల్‌గుడా జైలు నుంచి విడుదల కానున్నారు. కోర్టు సమయం ముగిసే సమయంలో ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతో పూచీకత్తులు సమర్పించడానికి తగిన సమయం లేకపోవడంతో ఆయన సోమవారం విడుదలయ్యే అవకాశాలు లేవు.
తమ అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కూడా కోర్టు జగన్‌కు షరతు విధించింది. పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశించింది. జైలు నుంచి విడుదల కావడానికి రేపు మంగళవారం కోర్టు ప్రారంభమైన తొలి గంటల్లో తగిన పత్రాలను కోర్టుకు సమర్పించడానికి జగన్ తరఫు న్యాయవాదులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో వైయస్ జగన్ మంగళవారం మధ్యాహ్నం విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ఆస్తుల కేసులో జగన్‌కు బెయిల్ మంజూరు కావడంతో పలువురు ఆయన తల్లి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిసి అభినందనలు తెలిపారు. జగన్ 16 నెలలుగా జైలులో ఉంటున్నారు. ఆస్తుల కేసులో జగన్‌ను సిబిఐ నిరుడు మే 27వ తేదీన అరెస్టు చేసింది. 28వ తేదీన కోర్టులో ప్రవేశపెట్టింది. అదే రోజు ఆయనను చంచల్‌గుడా జైలుకు తరలించారు.
వైయస్ జగన్‌కు బెయిల్ రావడం పట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. కేసులో సిబిఐ 1200 కోట్ల రూపాయల మేరకు మాత్రమే అభియోగాలు ఖరారు చేసిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications