బెంగళూరు విధానసౌధలో షర్మిల: కుమారుడితో కలిసి సీఎం డీకే శివకుమార్ తో
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను బెంగళూరులో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డితో కలసి ఆయనతో భేటీ అయ్యారు. విధానసౌధలో ఈ భేటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఆమె తన కుమార్తె అంజలిరెడ్డి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ పెళ్లికి హాజరు కావాలని, వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ ఆత్మీయ భేటీకి సంబంధించిన వివరాలు, ఫొటోలను డీకే శివకుమార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
వైఎస్ షర్మిల తన కుమారుడితో కలిసి వచ్చి పెళ్లి పత్రికను అందించడం పట్ల డీకే శివకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే నూతన జీవితంలోకి అడుగుపెట్టబోతున్న కొత్త జంటకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కాబోయే వధూవరులు నిండు నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలు, సంతోషాలతో వైవాహిక జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.

ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వైఎస్ షర్మిల ఒకవైపు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే పొరుగు రాష్ట్రాల్లోని సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సత్సంబంధాలను కొనసాగిస్తోన్నారు. ఈ క్రమంలోనే తమ ఇంట్లో జరగనున్న శుభకార్యానికి దక్షిణాదికి చెందిన పలువురు కీలక నేతలను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించడానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తోన్నారు.
తాము కలిసిన వేళ.. డీకే శివకుమార్ చూపిన ఆదరణ, ఆత్మీయతను షర్మిల ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాబోయే నూతన దంపతులకు ఆయన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారని, ఆయన చూపిన ఆప్యాయతకు తాము ఎంతో కృతజ్ఞులమని పేర్కొన్నారు. ఈ ముఖాముఖి భేటీ వారి మధ్య ఉన్నస్నేహానికి అద్దం పట్టింది. ఇప్పటికే ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ను కూడా కలిసి వెడ్డింగ్ కార్డ్ ను అందజేసిన విషయం తెలిసిందే.
కాగా.. వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోన్నారు. వైఎస్ అంజలి రెడ్డి వివాహం డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో ఈ ఏడాది నవంబర్ 25వ తేదీన జరుగనుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా ముగిసింది. దీంతో వైఎస్ షర్మిల, అనిల్ దంపతులు పెళ్లి ఏర్పాట్లల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ వివాహ వేడుక ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న రంగాల ప్రముఖులు ఒకే వేదికపైకి వచ్చే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
