Video: పేడ ఎత్తిన జర్మన్ రాయబారి! "భారత్లో బతకగలవా?"
అధికారిక హోదా, సూట్లు, బూట్లతో ఎప్పుడూ దౌత్య కార్యాలయాల్లో కనిపించే విదేశీ రాయబారులు ఒక్కసారిగా సాధారణ గ్రామాల్లో అడుగుపెడితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి అరుదైన ఆసక్తికరమైన ఘటనే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. న్యూఢిల్లీలోని జర్మన్ రాయబార కార్యాలయంలో పొలిటికల్ అఫైర్స్ హెడ్ అండ్ మినిస్టర్ కౌన్సెలర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మారియస్ ఒస్వాల్డ్ అనే దౌత్యవేత్త ఒక భారతీయ గ్రామంలో పర్యటించారు. ఫార్మల్ డ్రెస్ పక్కనపెట్టి మెడలో గమ్చా వేసుకుని, అచ్చమైన పల్లెటూరి రైతులా మారి ఆయన చేసిన సాహసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

"భారత్లో బతకగలవా?" అంటూ రైతు ఇచ్చిన సవాల్!
గ్రామంలోని ప్రమోద్ శర్మ అనే రైతును కలిసి ఆయనతో కలిసి కాలం గడిపారు మారియస్. ఈ సందర్భంగా రైతు ఆయనకు ఒక సరదాగా కూడిన సవాల్ విసిరారు. "భారతీయులు చదువుకోవడం కోసం, ఉద్యోగాల కోసం జర్మనీకి వెళ్తుంటారు.. కానీ ఇప్పుడు మీరు మన దేశ పల్లెటూరి జీవితాన్ని అనుభవించి, ఇక్కడ బతకగలరో లేదో నిరూపించుకోవాలి" అని శర్మ పేర్కొన్నారు. దానికి నవ్వుతూ అంగీకరించిన ఆ జర్మన్ అధికారి, గ్రామ జీవితంలోని అసలుసిసలు కష్టాలను తెలుసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు కదిలారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో తన బ్లేజర్ను తీసిపక్కన పెట్టిన మారియస్.. రైతు సూచన మేరకు మెడలో గమ్చా కట్టుకున్నారు. తొలుత ఆయనను పశువుల కొట్టానికి తీసుకెళ్లిన రైతు.. మూగజీవాలకు ఎలా మేత వేయాలో నేర్పించారు. ఆ తర్వాత చేతితో నడిపే చాఫ్ కట్టర్ (గడ్డి కోసే యంత్రం) సహాయంతో గడ్డి కోయడం వంటి పనులను స్వయంగా చేసి చూశారు. పల్లెటూరిలో ప్రతి రోజూ రైతులు పడే శ్రమ ఎలాంటిదో ఈ పనుల ద్వారా ఆయన ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
ఏమాత్రం సంకోచించకుండా.. బూత్ చేతులతో పేడ ఎత్తిన వైనం
అయితే అసలైన పరీక్ష ఆ తర్వాతే ఎదురైంది. పశువుల పేడను ఎత్తి తొట్టెలో వేయాల్సిన పని వచ్చినప్పుడు ఆయన కాస్త మొహమాటపడ్డారు. "ఇది మురికిగా ఉంటుంది కదా?" అని రైతును అమాయకంగా ప్రశ్నించగా, "అది మురికి కాదు" అని రైతు ధైర్యం చెప్పారు. ఆ మాటపై నమ్మకంతో ఏమాత్రం వెనకాడకుండా, చేతికి గ్లౌజులు కూడా వేసుకోకుండా ఒట్టి చేతులతోనే ఆ గోమయాన్ని ఎత్తి బుట్టలో వేశారు. ఆ వెంటనే రైతు ఆయనకు నీళ్లు పోసి చేతులు కడిపించారు. వ్యవసాయం చేయడం అంత సులభం కాదని ఈ అనుభవం ద్వారా తాను తెలుసుకున్నానని మారియస్ సరదాగా వ్యాఖ్యానించారు.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ప్రశంసల జల్లు
ఈ అరుదైన పర్యటనకు సంబంధించిన వీడియోను జర్మన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. భారతీయులు జర్మనీలో రాణిస్తున్నప్పుడు, తాము కూడా భారత్లో కలిసిపోగలమని నిరూపించుకోవడానికి ఇదొక చక్కని అవకాశమని రాయబార కార్యాలయం పేర్కొంది. ఏమాత్రం హంగు ఆర్భాటాలకు పోకుండా, ఎలాంటి సంకోచం లేకుండా పల్లెటూరి సంస్కృతిలో కలిసిపోయిన ఆ విదేశీ దౌత్యవేత్తను అందరూ అభినందిస్తున్నారు.













Click it and Unblock the Notifications
