వెస్టిండీస్ తో చివరి మ్యాచ్ వేళ.. టీమిండియాకు భారీ కుదుపు: స్టార్ బౌలర్ అవుట్: ఆ వెటరన్ కు చోటు
వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో చివరి మ్యాచ్ కు ముందు టీమిండియా జట్టులో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. గాయపడ్డ అర్ష్దీప్ సింగ్ స్థానంలో మరో వెటరన్ బౌలర్ కు చోటు దక్కింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ కు అతను అందుబాటులో ఉండట్లేదు. దీంతో ఈ చివరి మ్యాచ్ ఎలా ఉండబోతోందనేది చర్చనీయాంశమౌతోంది. అయిదు మ్యాచ్ ల ఈ సిరీస్ ను 2-2 తో భారత్, వెస్టిండీస్ సమవుజ్జీలుగా నిలిచాయి. శనివారం సాయంత్రం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో సిరీస్ డిసైడర్ అయింది.
హైదరాబాద్ లో జరిగిన నాలుగో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ గాయపడ్డ విషయం తెలిసిందే. అతని భుజానికి గాయమైంది. బెంగళూరు మ్యాచ్ కు కోలుకుంటాడని టీమ్ మేనేజ్మెంట్ భావించింది గానీ అది సాధ్యపడట్లేదు. తేలికపాటి ఫ్రాక్చర్ ఉన్నట్లు స్కానింగ్ రిపోర్టుల్లో తేలింది. మున్ముందు న్యూజిలాండ్ సిరీస్ ఆడాల్సి ఉండటం వల్ల అతనికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. ఫలితంగా.. చివరి మ్యాచ్ కు అందుబాటులో ఉండట్లేదు అర్ష్దీప్ సింగ్.

అతని స్థానంలో మరో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను స్క్వాడ్లోకి ఎంపిక చేసింది.. బీసీసీఐ. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో అతను ఆడటం దాదాపుగా ఖాయమైనట్టే. ఇప్పటికే న్యూజిలాండ్తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్కు ఎంపికయ్యాడీ 36 సంవత్సరాల వెటరన్ పేస్ బౌలర్. ఆ సిరీస్ కంటే ముందే టీమిండియాలో ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. వెస్టిండీస్ సిరీస్ ఆఖరి మ్యాచ్ కు కవర్ బౌలర్గా వ్యవహరించనున్నాడు.
చివరిసారిగా భువనేశ్వర్ కుమార్ 2022లో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి టీ20 ఇంటర్నేషనల్స్ కు దూరంగా ఉంటూ వస్తోన్నాడు. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు ఎంపికయ్యాడు. వెస్టిండీస్ తో సిరీస్ విజేతను తేల్చే కీలక మ్యాచ్కు ముందు అతను జట్టులోకి పునరాగమనం చేయడం టీమిండియా బౌలింగ్ విభాగానికి కొండంత బలాన్ని ఇచ్చినట్టయింది.
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున భువనేశ్వర్ కుమార్ ఆకట్టుకున్నాడు. వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడటంలో ప్రధాన పాత్ర పోషించాడు. మొత్తం 16 మ్యాచ్లలో 7.95 ఎకానమీతో ఏకంగా 28 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో కగిసో రబడ తర్వాత భువనేశ్వర్ రెండో స్థానంలో నిలిచాడు. తన ఐపీఎల్ హోమ్ గ్రౌండ్ లోనే మళ్లీ భారత్ తరఫున టీ20 ఇంటర్నేషనల్ ఆడబోతుండటం మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.













Click it and Unblock the Notifications
