ఏపీలోనూ ఓట్ల చోరీపై ఉద్యమం..! ప్రజలకు షర్మిల కీలక విజ్ఞప్తి..!
కర్నాటక, మహారాష్ట్ర, బీహార్ లో ఇప్పటికే ఓట్ల చోరీపై ఉద్యమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఏపీలోనూ అదే తరహా ఉద్యమానికి సిద్దమవుతోంది. అయితే ఇందు కోసం ముందుగా ఓట్ల చోరీకి నిరసనగా ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతివ్వాలని షర్మిల కోరారు.
నేటి నుంచి అక్టోబర్ 15 వరకు ఓట్ చోరీపై సంతకాల సేకరణకు పీసీసీ శ్రీకారం చుట్టింది. దేశ ప్రజల ఓటు హక్కు కాపాడటం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. భారతదేశ రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించిందని, మన నాయకులను మనం ఎన్నుకొనే స్వేచ్ఛ ఇచ్చిందని, ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కు ఉందని షర్మిల తెలిపారు. ఈసీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. కానీ ఎన్నికలసంఘం ప్రధాని మోడీ చేతిలో బందీ అయ్యిందన్నారు.

సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐ, స్టాక్ ఎక్ఛేంజ్ వంటి వ్యవస్థలు మోడీ గుప్పెట్లో బీజేపీ కోసం పని చేస్తున్నాయన్నారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీ కోసమే పని చేస్తుందన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దేశం ముందు బయటపెట్టారని, ఇది పచ్చి నిజమని షర్మిల తెలిపారు. ఇది మన భారత దేశ ప్రజాస్వామ్య యదార్ధత అని రాహుల్ గాంధీ దేశం ముందు ఈసీ బండారాన్ని బయట పెట్టారన్నారు. కర్ణాటకలోని మహాదేవపుర నియోజక వర్గాన్ని ఒక శాంపిల్ గా తీసుకున్నారని, అక్కడ లక్ష దొంగ ఓట్లను నమోదు చేశారని గుర్తుచేశారు. అన్ని దొంగ ఫొటోలు,దొంగ పేర్లు,దొంగ అడ్రస్ లే అన్నారు.

మహారాష్ట్ర ఎన్నికల్లోనూ సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో 60 లక్షలకు పైగా కొత్త ఓట్లు పోల్ అయ్యాయని,ఈ ఓట్లు ఎవరు వేశారని షర్మిల ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఉందంటే ఈసీ దగ్గర ఏ ఆధారాలు లేవన్నారు. అలాగే 5 ఏళ్లలో కంటే ఎన్నికలకు 5 నెలల ముందు కోటికి పైగా కొత్త ఓట్లు నమోదు అయ్యాయని, ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించారు. ఓట్ చోరీ కోసం ఇదంతా చేయలేదా ? అని నిలదీశారు. ఎన్నికల సంఘం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఓట్లను తొలగించిందని,బీజేపీకి అనుకూలంగా దొంగ ఓట్లను నమోదు చేసిందని ఆరోపించారు.

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ గా పని చేస్తుందని, ఓట్ చోరీ పై దేశ వ్యాప్త పోరాటం చేయాల్సిన అవసరం ఉందని షర్మిల తెలిపారు. అందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓ పోరాటం ప్రారంభించిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కావాలని కోరారు. సంతకం కూడా కావాలని, తమతో కలిసి పోరాటం చేయాలని ఏపీ ప్రజలకు మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications