రాజన్న బిడ్డ ఇక్కడ- పులిబిడ్డ.. పులిబిడ్డే
YS Sharmila: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు సంధించారు. ఈ పార్టీ చేస్తోన్న ఆరోపణలను తిప్పి కొట్టారు. ఎదురుదాడికి దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వానికి తలవంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
వైఎస్ఆర్సీపీ, దాన్న మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదంటూ ధ్వజమెత్తారు షర్మిల. కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు ఇంకా తొలగినట్లు లేదంటూ చురకలు అంటించారు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు కనిపించడం చాలా బాధాకరమని సెటైర్లు వేశారు.

ఏది చేసినా అర్థం, పరమార్థం తెలుగుదేశం పార్టీనే అనడం వైఎస్ఆర్సీపీ వెర్రితనానికి నిదర్శనమని ఎదురుదాడికి దిగారు షర్మిల. స్వయంశక్తితో ఎదుగుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో ముద్ర వేసుకుంటుంటే, చూసి ఓర్వలేక, అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం వైఎస్ఆర్సీపీ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు.
11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు బుద్ధిచెప్పినట్లు తీర్పునిచ్చినా.. వైసీపీ నీచపు చేష్టలు మారలేదంటూ ఆరోపించారు. అసత్యాలు వల్లె వేయడం మానుకోలేదని, నిజాలు జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు, ఇక ఈ జన్మకు మారబోరనే విషయం రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థమైందని చెప్పారు.
ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారు?, ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసునని షర్మిల మండిపడ్డారు. తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి.. స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ప్యాలెస్‌లు కట్టుకున్నారని, సొంత ఖజానాలు నింపుకున్నారని ఆరోపించారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని, రిషికొండను కబ్జా చేయాలని, మొత్తంగా ప్రధాని మోదీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచి పెట్టారని విరుచుకుపడ్డారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచి అయిదు ఏళ్ల పాటు మోదీ- అదాని సేవలో తరించినట్లు ప్రజలకు సర్వం బోధపడిందని చెప్పారు.
ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన ఖర్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలకు పట్టలేదని పేర్కొన్నారు. పులి బిడ్డ పులిబిడ్డేనని, ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్.. అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరి చేసేవే, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తుందని వ్యాఖ్యానించారు.
ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి మీకు దమ్ములేకుంటే, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాలను బయట ఉండి ఎత్తిచూపుతూ.. ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతున్నది ఈ రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ మోసాలను వైసీపీ ఎందుకు ఎండగట్టట్లేదని నిలదీశారు.












Click it and Unblock the Notifications