రేవంత్‌తో షర్మిల: త్వరలో చంద్రబాబుతో భేటీ
YS Sharmila: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైెఎస్ షర్మిల ప్రస్తుతం తన కుమారుడి నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉంటోన్నారు. ఈ నెల 18వ తేదీన వైఎస్ రాజా రెడ్డి- ప్రియా అట్లూరి నిశ్చితార్థం జరుగనుంది. దీనికి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీన వివాహ ముహూర్తం.
ఈ నేపథ్యంలో షర్మిల.. నిశ్చితార్థ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవలే కుటుంబ సమేతంగా, కాబోయే వధూవరులతో కలిసి కడప జిల్లాలోని ఇడుపులపాయలో గల వైఎస్ఆర్ ఘాట్‌ను సందర్శించారు. తొలి లగ్న, ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద ఉంచి, తండ్రి ఆశీస్సులను తీసుకున్నారు.

అనంతరం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో తన అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు. తాజాగా- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు షర్మిల.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత రేవంత్ రెడ్డిని కలుసుకోవడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిసేపటి కిందటే రేవంత్ నివాసానికి వెళ్లారు. తన కుమారుడి నిశ్చితార్థం, వివాహ మహోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. దీనికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
షర్మిల త్వరలో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని కలుసుకుంటారని తెలుస్తోంది. కుమారుడి వివాహ శుభలేఖను అందించడానికి ఒకట్రెండు రోజుల్లో.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం.
వైఎస్ రాజా రెడ్డి- ప్రియా అట్లూరిది ప్రేమ వివాహం. కులాంతర వివాహం కూడా. ఉన్నత చదువుల కోసం రాజా రెడ్డి.. అమెరికాకు వెళ్లినప్పుడు ప్రియా అట్లూరి పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. వారి ప్రేమ వివాహానికి అటు వైఎస్ షర్మిల- అనిల్ కుమార్ దంపతులు, ఇటు ప్రియ అట్లూరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు.












Click it and Unblock the Notifications