తండ్రి సమాధి వద్ద షర్మిల ఉద్వేగం : విజయమ్మ మౌనంగానే..ఆ నేత కన్నీరు : అన్న ను కలవకుండానే..!!
ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఉదయం నుండి ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది. ప్రతీ ఏటా వైఎస్సార్ కుటుంబం మొత్తం కలిసి కట్టుగా నివాళి అర్పించే వారు. గత ఏడాది నుండి మాత్రం ఇలా.. అన్నా..చెల్లి వేర్వేరుగా ఘాట్ వద్దకు వస్తున్నారు. ఇక, తెలంగాణ లో మరి కొద్ది గంటల్లో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ఏర్పటు ప్రకటన చేయనున్నారు. తన తండ్రి జన్మదినం నాడు తన నూతన పార్టీ ఏర్పాటు చేయాలని షర్మిల డిసైడ్ అయ్యారు. ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జన్మదినం కావటంతో షర్మిల తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించారు.

షర్మిల ఉద్వేగం..విజయమ్మ మౌనం
ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. తన కుమార్తె-కుమారుడుతో కలిసి దివంగత నేత సమాధి వద్ద కూర్చొని చాలా సేపు మౌనంగా ఉండిపోయారు. తల్లి విజయమ్మ..వైఎస్ వివేకా కుమార్తె సునీత సైతం ప్రార్దనల్లో పాల్గొన్నారు. పార్టీ జెండాను వైఎస్సార్ సమాధి వద్ద ఉంచారు. ముందుగానే కుటుంబ సభ్యులతో కలసి షర్మిల ..విజయమ్మ ఇడుపుల పాయ చేరుకున్నారు. పార్టీ నేతలు ఇందిరా శోభన్, పిట్టా రాం రెడ్డి, కొండా రాఘవ రెడ్డి సైతం ప్రార్ధనల్లో పాల్గొన్నారు. తన తండ్రికి నివాళి అర్పిస్తూ షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. దీనిని చూసిన పార్టీ నేత కొండా రాఘవరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. నివాళి కార్యక్రమం ముగిసిన తరువాత తల్లి..కుటుంబ సభ్యులు..పార్టీ నేతలతో కలిసి షర్మిల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరుతారు.

అన్నా..చెల్లి వేర్వేరు మార్గాల్లో..
వైఎస్సార్ మరణం తరువాత ఆ కుటుంబం మొత్తం ఒక్కటిగా నిలిచింది. కలిసి పోరాడింది. జగన్ సీఎం అయ్యారు. అయితే, ఇప్పుడు అంత ఆప్యాయంగా ఉండే అన్నా..చెల్లి ఇద్దరూ ఎవరి దారిలో వారు పయణిస్తున్నారు. ఇక, వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రతీ ఏటా ఉదయం సమయంలోనే నివాళి అర్పించే జగన్..ఈ ఏడాది మాత్రం సాయంత్రానికి తన సమయం మార్చుకున్నారు. ఉదయం షర్మిల అక్కడకు వస్తుండటంతో..ఇద్దరూ ఒకే సమయంలో తమ తండ్రి సమాధి వద్ద కలుసుకుంటారని వైఎస్సార్ అభిమానులు నిరీక్షించారు. కానీ, అంతర్గతంగా జరిగిన చర్చల ఫలితంగా సీఎం షెడ్యూల్ సాయంత్రానికి మారింది. ఇక, విజయమ్మ-షర్మిల వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తున్న సమయంలో వారిద్దరిలో ఈ గ్యాప్ బాధ స్పష్టంగా కనిపించింది.

ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు..
అదే విధంగా విజయమ్మ మౌనంగా తన భర్త సమాధి వద్ద కనిపించిన తీరు అదే ఆవేదన స్పష్టం చేస్తోంది. మధ్నాహ్నం పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించనున్నారు. పంజాగుట్ట నుండి పార్టీ ఆవిర్భావ సభ జరిగే జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ వరకు తెలంగాణ సంప్రదాయం లో ప్రత్యేక ప్రదర్శనలను పార్టీ నేతలు ఏర్పాటు చేసారు. తెలంగాణ వ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహాలను అలంకరించారు. ఇక, సాయంత్రం జరిగే పార్టీ ఆవిర్భావ సభలో షర్మిల పార్టీ జెండా - అజెండా అవిష్కరించనున్నారు.
Recommended Video

భవిష్యత్ అడుగుల పైన క్లారిటీ..
ఇప్పటికే జెండా నమూనా ఏంటనేది స్పష్టత ఇచ్చేసారు. ఇక, తెలంగాణలో తాను ఏ విధంగా భవిష్యత్ అడుగులు వేయబోయేదీ వివరించటంతో పాటుగా ఏపీతో తన వైఖరిని షర్మిల వెల్లడించనున్నారు. ఇక, ఈ పార్టీ ఆవిర్భావ సదస్సుకు విజయమ్మ సైతం హాజరు కానున్నారు. ఇప్పటికే పలు ప్రజా సంఘాలు..మేధావులు..మద్దతిస్తున్న ప్రముఖులను షర్మిల ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో..షర్మిల తన ప్రసంగంలో ఏ అంశాలను ప్రస్తావిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications