జగన్ డీల్ రద్దు, సీబీఐ విచారణ-లేకపోతే మీమీద డౌట్స్-బాంబు పేల్చిన షర్మిల..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నుంచే అందులో పార్టీలకు మద్దతుగా వ్యవహరిస్తున్న పీసీసీ ఛీఫ్ షర్మిల.. తాజాగా రూటు మార్చారు. కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలతో మొదలుపెట్టి ఒక్కో అంశంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న షర్మిల.. ఇవాళ సీఎం చంద్రబాబుకు మరో అంశంపై లేఖ రాశారు. ఇందులో జగన్ చేసుకున్న సౌర విద్యుత్ ఒప్పందం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
అదానీతో జగన్ మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తక్షణం రద్దు చేయాలని లేఖలో చంద్రబాబును షర్మిల కోరారు. అక్రమ డీల్ తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం రూ.1.50 లక్షల కోట్లు కాబట్టి వెంటనే ఈ డీల్ రద్దు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్ పై ప్రభుత్వం సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా కోరారు.

విద్యుత్ కొనుగోళ్ల విషయంలో లంచాలు తీసుకున్నట్లు ఇప్పటికే అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు నిరూపించాయని, స్కీంల కోసం స్కాంలకు పాల్పడ్డట్లు ఆధారాలు సైతం చూపించాయని షర్మిల తెలిపారు. అదానీకి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆండ్ కో కి రూ.1750కోట్లు నేరుగా లంచాలు ముట్టినట్లు అమెరికా కోర్ట్ లో తీవ్ర అభియోగాలు మోపారని గుర్తుచేశారు.
దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే,మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంధ్ర రాష్ట్ర పరువును తీశారని షర్మిల ఆరోపించారు. తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీశారన్నారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత నష్టాల్లోకి నెట్టారని తెలిపారు. అదానీ, జగన్ మోహన్ రెడ్డి మధ్య జరిగిన వ్యాపార లావాదేవిలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకొనే భారీ కుంభకోణంగా ఏపీసీసీ భావిస్తోందన్నారు.
అదానీతో ఒప్పందం ప్రకారం సౌర విద్యుత్ అంత్యంత చౌక అని, విద్యుత్ కొనుగోళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించిన విజయంగా గొప్పలు చెప్పుకున్నారని షర్మిల ఆరోపించారు. కానీ అదానీ దగ్గర నుంచి గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర రూ.1.99పైసలకు కొంటుంటే, ఏపీ మాత్రం యూనిట్ ధర రూ.2.49పైసలుగా అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు. గుజరాత్ కంటే 50పైసలు ఎక్కువ పెట్టి కొన్నారని, ఈ ఒప్పందం సమయంలో విద్యుత్ సరఫరాకు అదనపు ఛార్జీల భారం ఉండదని చెప్పారని గుర్తుచేశారు.
కానీ ట్రాన్స్మిషన్ ఛార్జీలతో పాటూ అదానీ పవర్ రాష్ట్రానికి చేరే సరికి ఇతర ఛార్జీలు కలుపుకొని యూనిట్ ధర 5 రూపాయల కంటే ఎక్కువగా పడుతుందన్నారు. ఎక్కువ రేటు పెట్టి సోలార్ పవర్ కొన్నందుకు గాను 25ఏళ్లకు రాష్ట్ర ప్రజలపై పడే భారం అక్షరాల లక్ష కోట్లన్నారు. ట్రాన్స్మిషన్ చార్జీల భారం అదనంగా మరో 50వేల కోట్లన్నారు. అంటే అదానీతో జగన్ రూ.1750కోట్ల లంచాలకు ఆశపడి చేసుకున్న ఒప్పందానికి రాష్ట్రం నెత్తిన పడే భారం రూ.1.50లక్షల కోట్లన్నారు.
ఇదంతా అదానీకి దోచిపెట్టే కుట్ర కాకపోతే మరేంటన్నారు. ఈ లక్షా 50వేల కోట్ల రూపాయల దోపిడిలో జగన్ కు ముట్టే వాటాలు ఎంతో తేలాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.17వేల కోట్ల భారం మోపారని, దీనికి అదనంగా అదానీతో చేసుకున్న అక్రమ ఒప్పందాలకు ప్రతి ఏటా రూ.5వేల కోట్ల భారం పడనుందని తెలిపారు. అదానీతో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు మొత్తం సీఎంవో నుంచే నడిచాయని, ఈ విషయాన్ని స్వయంగా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి ఒప్పుకున్నారన్నారు.

పిలిచి ఎక్కడసంతకం పెట్టమంటే అక్కడ పెట్టానని చెప్పారని, అప్పటి సీఎం జగన్ అదానీని కలిసిన తెల్లవారే సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వచ్చిందని తెలిపారు. అదానీ తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, గ్రీన్ ఎనర్జీ కంపెనీతో ఒప్పుందం చేసుకోవాలని సెకీ కోరగా, ఉన్న ఫలంగా అన్ని పనులు
పక్కన పెట్టి, మరునాడే రాష్ట్రమంత్రి వర్గ సమావేశం పెట్టారని తెలిపారు.
అదానీతో ఒప్పందాలను ఆమోదిస్తూ అప్పటి వరకు చేసుకున్న అగ్రిమెంట్ లు అన్ని రద్దు చేశారన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఎటువంటి ప్రజాభిప్రాయం సేకరించకుండా,అదే కంపెనీ ఇతర రాష్ట్రాల్లో చేసుకున్న ఒప్పందాలను పరిశీలించకుండా వెంటనే ఆమోదముద్ర వేసిందన్నారు. ఆర్థిక,విద్యుత్ శాఖలు సైతం ఒప్పంద దస్త్రానికి అనుమతులు ఇచ్చేందుకు అర్ధరాత్రి వరకు పని చేశారని,కేవలం 7గంటల్లోనే అన్ని రకాల క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. జగన్ ఏ స్వలాభం లేకుంటే,రూ.1750కోట్ల లంచాలు తీసుకోకుంటే,ఇంత హుటాహుటిన సోలార్ పవర్ ను కొనాల్సిన అవసరం ఏమొచ్చిందో, నిజనిజాలు ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నారు.
జగన్-అదానీ ఒప్పందం మీద మన దేశం,రాష్ట్రం పరువు తీసేలా అంతర్జాతీయ మార్కెట్ లో చర్చల మీద చర్చలు జరుగుతున్నా మీ కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదన్నారు. ముడుపుల అంశంలో కనీసం నోరువిప్పడం లేదన్నారు. అంటే అదానీ మీకు కూడా ఆఫర్లు పెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ ప్రాజెక్ట్ తో పాటూ,రోప్ వే నిర్మాణం,బీచ్ శాండ్ ఉత్పత్తుల ప్రాజెక్టులు,కొత్తగా సోలార్,హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీ కి కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అమెరికా దర్యాప్తు సంస్థల ద్వారా అసలు విషయం బయటపడ్డాక మళ్లి మీరు కూడా ఆ కంపెనీతోనే ముందుకు వెళతారా లేక రాష్ట్రంలో అదానీ గ్రూప్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెడతారా తేల్చుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications