మోడీ పిలక మీ చేతుల్లో ఉంది.. చంద్రబాబు ముందు షర్మిల కీలక డిమాండ్..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉంటున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఓ కీలక అంశంపై స్పందించారు. సీఎం చంద్రబాబు మొన్న పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయడంపై స్పందించిన షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ పిలక ఈసారీ మీచేతుల్లోనే ఉందని ఆయనకు గుర్తుచేశారు. దీన్ని ఉపయోగించుకుని 2029 లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని షర్మిల సూచించారు.
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు,, పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ,టీడీపి,వైసీపీ పార్టీలేనని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రాజెక్ట్ కట్టి 28లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయమయితే, పంతాలు పట్టింపులకు పోయి జీవనాడి పై ఇన్నాళ్లు జరిగింది రాజకీయ దాడి తప్పా మరోటి కాదన్నారు.
విభజన సమయంలో పోలవరానికి కాంగ్రెస్ జాతీయ హోదా ఇస్తే, మోడీ సర్కార్ ఆ భాధ్యత 10 ఏళ్లు విస్మరించి నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపిందన్నారు.

కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ ను తానే కడతానని చెప్పి పొలవారం,సోమవారం అంటూ హడావిడి తప్పా..బాబు మొదటి 5 ఏళ్లలో చేసింది శూన్యమని షర్మిల విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ అంచనా వ్యయం పెంచాడే తప్పా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నారు. 10 వేల కోట్లతో కాంగ్రెస్ హయాంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు నిర్లక్ష్యం ఖరీదు అక్షరాల 76 వేల కోట్లు అన్నారు. ప్రాజెక్ట్ కట్టాలంటే మరో 5 ఏళ్లు పడుతుందని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మోడీ పిలక మీ చేతుల్లోనే ఉంది, కేంద్రాన్ని శాసించే అధికారం మీ దగ్గరుంది కాబట్టి, పూర్తి స్థాయి నిధులు తెచ్చి,రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా
పోలవరం పూర్తి చేయాలని షర్మిల కోరారు.












Click it and Unblock the Notifications