త్వరలో తెలంగాణలో వైయస్ షర్మిల పరామర్శ యాత్ర
మహబూబ్‌నగర్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల త్వరలో తెలంగాణలో పరామర్శ యాత్ర చేపడుతారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం ఈ విషయం చెప్పారు. జిల్లాలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తమ పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు.
రైతుల ఆత్మహత్యలపై ఆ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు జనక్ ప్రసాద్, గట్టు రామచంద్రరావు, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాష్ రావు, శివకుమార్, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత సమావేశంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రసంగించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి చెందిందని చెప్పారు. నాలుగు ఎత్తిపోతల ప్రాజెక్టులను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించినట్లు గుర్తు చేశారు. తర్వాత ఏ నాయకుడు కూడా ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే ఆలోచన కూడా చేయలేదని ఆయన విమర్శించారు. తగిన విద్యుత్తు లేకపోవడంోత పంటలు దెబ్బ తిన్నాయని చెప్పారు.
రైతులకు పరిహారం అంది ఉంటే ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు ఆత్మహత్యలు చేసుకున్న రైతులను తిరిగి బతికించగలుగుతామా అని ఆయన ప్రశ్నించారు. ఎండిపోయిన ప్రతి ఎకరా పంటకు రూ.25 వేల చొప్పున పరిహారం ప్రకటించాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రజల కష్టాలపై తమ పార్టీ పోరాటం చేస్తుందని పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications